గంగా స్తోత్రం శంకరాచార్య కృతం
ఆది శంకరుల గంగా స్తోత్రం.............!!
ఉదయం లేవగానే గంగమ్మతల్లిని స్మరిస్తే..
ఆరోజు శుభప్రదంగా ఎటువంటిహాని కలగకుండా గడుస్తుంది.
అటువంటి గంగామాతను ఈస్త్రోత్రంతో నిత్యం ప్రార్థిస్తే తెలిసీతెలీక మనవల్ల ఒకరికి హానిజరగకుండా ఒకరికినుండి మనకు హానికలగకుండా రక్షించబడతారు.
1:: "దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే
శంకరమౌళివిహరిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే"
ప్రకాశించేదానా! దేవతలకు దేవతా!పూజ్యురాలా! ఓ గంగాదేవీ! మూడు లోకాలను తరింపచేయుదానా! ప్రకాశించే తరంగాలు కలదానా!
శుభాలు కలిగించే శంకరుని కొప్పుపై విహరించు దానా! పవిత్రమైనదానా! నీ పాద పద్మాలలో ఎప్పుడూ నాబుద్ధి నిల్చియుండుగాక!
2:: "భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామ జ్ఞానమ్"
అందరికీ సుఖాన్ని కలిగించే భాగీరథి (భగీరథునిచే భూమికి తేబడినది) అని పిలువబడే గంగమ్మా! నీపవిత్రమైన నీటిమహిమ వేదాల్లో వర్ణింపబడినది.
నీయొక్క మహిమను నేనుపూర్తిగా తెల్సుకోలేను. దయకలిగిన దానా ! నా అజ్ఞానాన్ని క్షమించు.
3:: "హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్"
గంగామాతా! నువ్వు శ్రీహరి పాదాలనుంచి పుట్టావు. నీస్వచ్చమైన తరంగాలు , తెల్లటి మంచును, చంద్రున్ని, ముత్యాలను పోలిఉంటాయి. పాపభారాన్ని నానుంచి తొలగించు.
ఈ సంసార సాగరాన్ని తరింపచేయి.
4:: "తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః"
గంగామాతా! నీస్వచ్చమైన నీటిని త్రాగినవాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు.
నీ భక్తుడిని చూసే శక్తి యమునికుండదు.
(గంగాదేవి భక్తుడు యమలోకానికి వెళ్లడు).
5:: "పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే"
గంగామాతా! అధోగతిని పొందినవారిని నువ్వు ఉధ్ధరిస్తావు. హిమలయ పర్వతాలనుండి ప్రవహించే సందర్భంలో పర్వతాగ్రాలను నువ్వుఖండిస్తూ,
ఒక రకమైన అలంకారాన్ని ఆ పర్వతాలకు ఇస్తుంటావు.భీష్మునికి తల్లీ ! జహ్నుముని కూతురా ! జీవితంలో పడినవారిని, పదవి చెడినవారిని ఉద్ధరిస్తావు. మూడులోకాలను ధన్యం చేస్తావు.
6:: "కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే"
ఓ గంగామాతా! నువ్వు కల్పలతలా లోకాలకు ఫలాలనందిస్తుంటావు. నీకు నమస్కరించినవాడు ఏనాడు శోకాన్ని పొందడు. అనురాగంతో కదిలే చూపులు కల్గిన యువతి చూపుల్లా నువ్వు సముద్రంలో కలిసేటప్పుడు(విహరించేటప్పుడు)
నీ తరంగాలు ఉంటాయి.
7:: "తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే'
ఓ గంగామాతా! ఒక్కసారి నీలో స్నానంచేసిన వాడు, మళ్ళీ పునర్జన్మను పొందడు.
నువ్వు నరకాన్ని నివారించేదానివి.
పాపాలను నశింపచేసే దానివి.
ఉన్నతమైన మహిమలు కలదానివి.
8:: "పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే"
ఓ జాహ్నవీదేవీ ! నీకు జయము..జయము. నువ్వు ఈ మలినయుక్తమైన శరీరాన్ని నీతరంగాలతో పవిత్రము చేస్తావు. నీపాదాలు ఇంద్రకిరీటములోని మణులకాంతులతో అలంకరించబడుంటాయి.
సేవా భావంతో నీకు శరణన్నవానికి సుఖాన్నిస్తావు, శుభాన్నిస్తావు.
9:: "రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే"
ఓ పూజ్యురాలైన గంగామాతా! నారోగాన్ని, విచారాలను, పాపాలను, చెడుభావాలనుతొలగించు.
నువ్వు మూడులోకాలకు సారభూతమైనదానివి.
ఈ భూమికి నువ్వోక హారమువంటిదానివి.
ఈ సంసారంలో నువ్వేనాకు గతివైన్నావు.
10: "అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః"
ఓ అలకనందా ! గంగాదేవీ!
పరమానందం ఇచ్చేదానా !
భయపడినవారిచే నమస్కరింప బడేదానా!
నా యందు దయఉంచు. నీతీరంలో ఎవరుంటారో, వారు వైకుంఠములో ఉన్నట్లే.
11: "వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః"
ఓ గంగామాతా! నీనీటిలో తాబేలుగాకాని,
చేపగా కాని, నీనీటి ఒడ్డున అల్పమైన ఊసరవెల్లిగా కాని జీవించుటెంతో అదృష్టముంటే కాని కల్గదు.
పవిత్రమైన నీనది ఒడ్డున కుక్కను వండుకుని తినే శ్వపచుడు, నీకుదూరంగా జీవించే ఉత్తమ కులీనుడైన రాజు కంటె గొప్పవాడు.
12:: "భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్"
ప్రపంచానికి ఈశ్వరీ ! ఓ పుణ్యురాలా ! ధన్యురాలా! దేవీ! ద్రవరూపంలో మహాముని
జహ్ను మహర్షి కుమార్తెగా మారినదానా !
పవిత్రమైన ఈ గంగాస్తవమును ప్రతిరోజూ
ఎవరైతే చదువుతారో, వారికి తప్పక జయం,
శుభం సిద్ధిస్థాయి.
13:: "యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః"
ఎవరి హృదయంలో గంగాభక్తి ఉంటుందో, అతడు తప్పకుండా స్వేచ్చయొక్క ఆనందాన్ని హృదయంలో అనుభవిస్తాడు.
పంఝటికా చందస్సు లో మధురాహ్లాదంగా రచింపబడిన ఈ గంగా స్తోత్రం పరమానందభరితమైనది.
14:: "గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః"
ఈ సంసారంలోని సారం ఈ గంగాస్తోత్రం.
ఈ స్తోత్రాన్ని భక్తితో చదువుకున్నవారికి కోరినకోర్కెలు నెరవేరుతాయి. ఇది స్వచ్చమైనది.
శంకరుని సేవకుడైన శంకరునిచే ఈ స్తోత్రం రచింపబడినది. ఈ స్తోత్రం ఆసాంతం చదివినవారు సంతోషాన్ని, సుఖాలను పొందుతారు.
అందరికీ జయం కలగాలని కోరుకుంటున్నాను.
Comments
Post a Comment