ఆలూరు రంగనాథ శతకం

ఓం

       స్థల పురాణం
-----------------------------
పూర్వము విశ్వామిత్ర మహర్షి చేయుచున్న యజ్ఞ యాగములను భంగము చేయుచున్న రాక్షసులను 
సంహరించుటకై దశరథ పుత్రులైన రామలక్ష్మణులను
వెంట తీసుకొచ్చి తాటకి మొదలగు రాక్షసులను నిర్మూలము గావించి తదుపరి ఇక్కడే శ్రీరంగనాథ స్వామి విగ్రహ ప్రతిష్ట చేశాడని ప్రతీతి కావున సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్ర మహర్షి చేత
ప్రతిష్టించ బడిన స్వామి కాబట్టి అంతటి గొప్ప మహిమాన్వితమై శ్రీ దేవి భూదేవి సమేత దివ్య తేజో మూర్తిగా విరాజిల్లుచూ ఎల్ల జగాలను స్వామి వారు
పడుకొనే పాలించు చున్న ఏకైక మోక్షాధి పతి శ్రీ రంగనాథ స్వామి మరియు 

జగన్నాటక రంగస్థలానికి నాయకుడైన శ్రీ రంగనాథ స్వామిని అశ్రయించుట చేత దుఃఖశమనం, 
సంచిత పాప వినాశనము, అకాలమృత్యు ఆపదలు తొలగి సంఘంలో గౌరవ కీర్తి ప్రతిష్టలతో,   స్వామి వారి మీద, పెద్దల మీద, గురువుల యందు, భక్తి ప్రపత్తులు పెరిగి నిత్య కళ్యాణం పచ్చ 
తోరణములా సకల సంతోషములతో సకుటుంబ సమేతంగా వంశాభి వృద్ది చెంది చిట్ట చివర కైవల్య ధామం చేరుదురు.


       ప్రస్తుత ఆలయ నిర్మాణం
--------------------------------------------
క్రీ.శ.1334 లో విజయనగర రాజ వంశానికి చెందిన
బుక్కరాయ ఆస్థాన ప్రముఖుడు అయిన ఎఱ్ఱం రాజు
ఈ ఆలయాన్ని నిర్మించాడని పురావస్తు శాసనం 
ఈ స్వామి ఆలయ పూజాది కైంకర్య కార్యక్రమములు
పూర్తిగా వైష్ణవ సాంపదాయం ప్రకారమే జరుగు చున్నవి.
ఆలయ సమయాలు ఉ.630 నుండి రాత్రి 830 వరకు.
ఆలయ బ్రహ్మో త్సవాలు చైత్ర శుద్ధ నవమి నుండి చైత్ర బహుళ విదియ వరకు స్వామివారికి వివిధ వాహన సేవలు జరుగును.


 పాఠకులకు విఙ్ఞప్తి తప్పులున్నచో మన్నించ ప్రార్థన
------------------------------------------------------------------
1. పద్యములు పాడుకొను వారు ఎవరికి వారు  
వారికి నచ్చిన రాగాములలో ఆలాపన చేసుకొనవచ్చు.

2. పద్యములు సామాన్య ప్రజలకు కూడా చదివి నంత మాత్రముననే అర్థమయ్యే విధమున ప్రస్తుతం తెలుగు భాషలో ఉన్న పదాలను మాత్రమే
క్రోడీకరించి వ్రాయడమయినది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రస్తుత ప్రజలు గ్రాంథిక భాషను అర్థం చేసుకోవటం చాలా కష్టమని భావించి వీలైనంత
వాడుక  బాషణే ఇందులో కనబరచటం జరిగింది. 

3. యక్కడైన పదము అన్వయంకాదు పొరపాటని అనిపిస్తే  యవరికి వారు అక్కడ అన్వయమయ్యే పదము వేసుకొని పాడుకోవచ్చు.

4. ఇందులో నారాయణమూర్తిని గూర్చి చెప్పడమే
  తప్ప అన్యమైన దేదియు చెప్ప లేదు.

రచయిత
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
------------------------------------------------------------------
     సీసపద్య గణముల కలయిక విధానము

ఇంద్రగణము లారు దినగణంబులు రెండు
     పాద పాదమునకు వరలు చుండు.

               ఇంద్ర గణాలు. 6
నల, llll - నగ, lllU - సల, llUl - భ, Ull
ర, UlU - త, UUl

             సూర్య గణములు. 2
         నగణం,llll - హగణం, Ul

సీస పద్యములో యెనిమిది పాదాలుంటాయి
అందులో మొదటి పాదంలో నాలుగు ఇంద్ర గణాలు రావాలి రెండవ పాదంలో రెండు ఇంద్ర గణాలు రెండు సూర్య గణాలు రావాలి ఇక ఎతి
విషయాని కోస్తే మొదటి పాదంలోని  మొదటి అక్షరం యతి అనబడును మొదటి పాదమునకు ఆ మొదటి అక్షరం మూడవ గణమునకు వచ్చు మొదటి అక్షరం ఎతి కుదరాలి లేదా యతి కుదర నప్పుడు ప్రాస యతి వాడుకోవచ్చు ప్రాస యతి అనగ యతి ప్రక్కనున్ను అక్షరం ప్రాసయతిగా  వాడ వచ్చును

               ఉ, హ
ఇంద్ర,.         ఇంద్ర.     ఇంద్ర.      ఇంద్ర
  UU l           l l U l     UU l.        l l U l 
మందార  మకరంద  మాధుర్య  మునదేలు
 ఇంద్ర.           ఇంద్ర.       సూర్య సూర్య
   l l U l          U l U       l l l.     l l l 
మదుపంబు   బోవునే   మదన ములకు 

ఇక్కడ యతి  మందార మొదటి గణములోని 
మ, కు రెండవ గణములోని  మాధుర్య అనే మాకు 
యతి కుదిరింది అలానే రెండవ పాదంలో 
మధుపంబు లోని మొదటి గణ మైన మా, కు మూడవ గణం మదన అనే మా, కు యతి కుదిరింది.

     ఇక తేటగీతి  యొక్క గణాలు 
సూర్య నొక్కండు సురరాజు లిద్దరు దినకర 
ధ్వయంబు తేట గీతి.

తేట గీతిలో పైనున్న గణాలే ఉంటాయి మొదటి
పాదములో మొదటి గణం సూర్య గణం రావాలి
తరువాత రెండు ఇంద్ర గణాలు రావాలి ఆ తరువాత రెండు సూర్య గణాలు పడాలి 
మొత్తం నాలుగు పాదాలు ఇలానే ఉంటాయి గణాలు యతి మొదటి దానికి  నాల్గవ దానికి యతి కుదరాలి ప్రాస యతి కూడా వాడవచ్చు
ప్రాస యతి అనగా ముందున్న యతి అక్షరానికి
ప్రక్కనున్నది వాడవచ్చు యతి ప్రక్క స్థానంలో

            ఉ , హ
తేట గీతి పై పద్యములోనిదే
సూర్య  ఇంద్ర.   ఇంద్ర.  సూర్య  సూర్య
 U l      U l l      U l U.   U l.     U l 
నంబు  జోదర   దివ్యపా  దార   వింద 

సూర్య. ఇంద్ర.     ఇంద్ర.  సూర్య సూర్య
U l        U l l       U l l.     U l.    U l 
చింత  నామృత   పానవి  శేష    మత్త

ఇక్కడ యతి మొదటి పాదంలో నంబు అనే న ,కు
నాలుగవ పాదం దార అనే ద,కు యతి కుదిరింది

ఇక రెండవ పాదంలో మొదటి గణం చింత అనే
 చి, కి  నాలుగవ గణమైన శేష , అనే శే, కి యతి కుదిరింది ఇవి తేటగీతి లక్ష ణాలు

విశ్లేషణ
యలిగండ్ల నాగరంగయ్య


          గణేశ ప్రార్థన
సీ ll
తోరణ గణపతి తొలిపూజనలు నీకు
        బ్రియముతో చేతును ప్రేమ మీర
విఘ్ననాయక దేవ విఘ్నేశ్వరా స్వామి
       విన్నపంబులు నీకు విమల చరిత
నగజాతసుతదేవ నారాయణార్చిత
       నన్ను గావుము తండ్రి నాగ మొలన
దంత సుందర తేజ దాక్షాయ నేష్టితా
       తప్పులేంచకు మయ్య తలతు నిన్ను
       
తే ll 
అఖిల గణనాథ  ఆనంద నాట్య లోల
మంభి కానంద సుతదేవ మవని పాల
సకల శుభకర దేవ శ్రీ సాధు వంద్య
సుజన పరిపాల దేవవో సుముఖ వదన ll


        శ్రీ రంగనాథ నామామృత పద్య ప్రార్థన 

సీ ll 
శ్రీహరి నీ నామ చింత జేసెద నయ్య
       సంచితంబులు బాపు సార సాక్ష
ప్రహ్లాద రక్షక పన్నగ శయణేశ
      శరణు శరణు శంఖ చక్ర హస్త
సురరాజ పూజిత సుగుణా నిధే దేవ
       మునిభక్త హృదయేశ ముక్తి దాత
కౌస్తుభ మణిహార కారుణ్య వరదేవ
కనక కుండల భుష కమల నేత్ర
తే ll 
భక్త మందార గోవింద భావ నిలయ
భజన జేసెద సతతంబు భక్తి తోడ 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగ నాథ ll    1

సీ ll
దివ్యాంగముల తేజ దినకర శశినేత్ర
       రాక్ష సాంతక దేవ రంగనాథ
మందర గిరిధర మాణిక్య మణిహార 
      రాధికా రమణవో రంగనాథ
సారస పత్రాక్ష సాధుగణా రాద్య
      రణరంగ భీకర రంగనాథ
ఇందిరా మందిర వందన స్వీకర 
      రఘువంశ రత్నమా రంగనాథ 
తే ll 
భవ్య చారిత్ర సుచరిత్ర భక్త నేత
పతిత పావన శ్రీపాద పద్మ యుగళ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ. ll    2

సీ ll
భవభంద రుగ్మతల్ బాపంగ యిలమాకు
        హరినామమే దివ్య మౌష దంబు
అజ్ఞాన తిమిరాంధకారంబు బాపంగ
        హరినామమే దివ్య అరణి మాకు
పాపవనము నంత పతనంబు చేయంగ
      హరినామమే దివ్య నాయుధంబు
కర్మ శేషంబెల్ల కరిగింప జేసేది
       హరినామమే పాప హరసుతాబ్ది
తే ll 
అట్టి నామము నోటితో ననక నెపుడు
నింపు మాటలు విరివిగా నివ్వ నెల
అవని నాలూరు కోనన యలరుచున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ.ll    3

సీ ll 
భోగీంద్ర శయణ హే బొమ్మలాటకుడీవె 
          నీ సూత్రమున బొమ్మ నీకు నేను 
చిత్రకారుడ వౌచు చిత్రము గీచితే 
            నీచేతిలో మేము నీలి కుంచె
గారడి వాడవై గమ్మత్తు సేయంగ
         వేడ్కతో  నీచేతి విద్య నేను
తిరుగలి చేబట్టి తిప్పు చుండెడి చోట
         తిరుగు చేతిన గుంజ దిరుగు నేను
తే ll 
దేవ నీవెట్లు తిప్పిన దిరుగు చుందు
నీవు చాలించిన జగతి నిలిచి పోవు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    4

సీ ll
సత్యంబు గనలేని చాలచదువు లేల
        దానమీయగ లేని ధనము నేల
నీటి చుక్కయు లేని యేటి  ఘనత నేల
        దేవుడుండని పెద్ద కోవె లేల
భర్త మాట వినని భామ గౌరవ మేల
         ప్రజల మేలు గనని ప్రభువు లేల 
కర్మ శుద్ధిగ లేని కార్య క్రతువు లేల
        సద్గుణంబులు లేని సాధు వేల

తే ll భార్య లేకుండగా పెద్ద భవన మేల
విష్ణు గొనియాడ జాలని విజ్ఞ తేల
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   5

సీ ll
నారాయణాయని  నాలుకాడుట నేర్పు
         శిరముకు హరిపాద శరణు నేర్పు 
చిత్తంబునకు హరి చింత చేయుట నేర్పు
        వీనుల హరికథల్ వినుట నేర్పు
కనులకు శ్రీకాంతు గాంచు చుండగ నేర్పు
        కాయంబునకు శుద్ద కర్మ నేర్పు
చేతుల దానంబు చేయబూనగ నేర్పు
        మనసుకు నేర్పించు మంచి తనము
తే ll 
భక్తి భావము కుదురుగా బడయ నేర్పు
భావ మందున నీ భక్తి భద్ర పరచు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    6

సీ ll
నీ భక్త జనులను నిందిజేసెడి వారు
         నిరప రాధుల తప్పు నెంచు వారు
సాధు సజ్జనులను చావ గొట్టెటి వారు
         జంతు జాలములను జంపు వారు
బల హీనులను బట్టి బాధ పెట్టెటి వారు
         జగతికి కీడును జరుపు వారు
పరకాంత సుఖముకై పరిత పించెడి వారు
         పరమాత్మ నామంబు పలక నోరు
తే ll 
దురిత కర్ములు దుర్జన దుష్ట మతులు
దూర మౌదురు పరమందు దుష్టు లంత
అవని నాలూరు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    7 

సీ ll
అహమును వర్జించి హరినామమున్బాడు
         గోవింద గోపాల గొలచి దలచు 
నారాయణాయని నార్థితో నర్చించు
          పద్మనాభుని యందు భక్తి గుండు
వైకుంఠ ధాముని వదలక గొనియాడు
         సిరి నిలయుడని శ్రీ హరిని వేడు 
ముక్తికారణ మన్చు ముదముతో పూజించు
         జగమేలు స్వామికి జయము బల్కు
తే ll 
మూర్తి శరణార్థి వై నీవు ముక్తి నడుగు
భక్తి భావమందున బుద్ది బడయ మునుగు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     8

సీ ll
ఆకాశ మునకన్న యగ్నియంతటి కన్న
         హరినామమే చాల నధిక మన్న
గ్రహము లన్నిటి కన్న గంగతీర్థము కన్న
          హరినామమే చాల నధిక మన్న
పూర్వ ధనము కన్న భూమి సంపద కన్న
          హరినామమే చాల నధిక మన్న
సూర్యచంద్రుల కన్న సురగణంబుల కన్న
         హరినామమే చాల నధిక మన్న
తే ll 
ఇట్టి హరినామమును మించి యిలనలేదు
దలతు రెందరో హరిభక్త దాసు లెల్ల
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     9

సీ ll
నారాయణా యని నాలుకతో  బల్కు
       కష్ట మేమియు గాదు యిష్ట ముంటె
హరిని చేరుటకిది యవనిలో సులభంబు
        అంగ హీనుల కైన నార్థి కైన
అజ్ఞాన మతికైన సుజ్ఞాన బుధి కైన
       మునిమానసుల కైన ముదిమి కైన
మనుజ నీచకుడైన మంచి వారల కైన
      మోక్ష మందరి కిచ్చు   ముదము తోడ
తే ll 
కాన దలచరో నామంబు కష్ట మనక
వేడ విడువక నుండు యే వేల యైన
అవని నాలూరు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    10
       
సీ ll
మనిషినై పుట్టిన మంచితనము లేక
         దుర్గుణంబులతొ నే ధూర్థి నయితి
పరమాత్మ ననుచు నే పలకజాలను నోట
          దూషనంబులు చేసి దురిత నయితి
భాగవతుల కాళ్ళు బట్ట జాలక పోతి
          చేతులారగ పూజ చేయ నయితి
శ్రద్ధగా నీకథల్ శ్రవణంబు చేలేదు
         కన్ను లారగ నిన్ను కాంచ నయితి
తే ll 
దేహ మస్థిరంబని నేను తెలియ నైతి
నాత్మ సుస్తిరంబనియు నే నమ్మ నైతి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     11

సీ ll
దశరథా నందన దామోధరా యని
        దలచ లేదని నీవు దాగి నావ
ధనలక్ష్మి నాథుడ దాన మడుగ మేము
        క్షీర సాగరమున చేరి నావ
వరలక్ష్మి విభువనీ వరము గోరుదమని
        విషమున్న పాముపై విడిది నావె
భూదేవి పతివనీ భూదాన మిమ్మన
        పక్షి వాహన మెక్కి పారి నావె
తే ll 
నెట్లు బోయిన నిన్ను నే నిడువ తండ్రి
నేడు దొరికి పొమ్మిక దేవ నీకు నీవె 
అవని నాలూరు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  12

సీ ll
చేయరాని పనులు చేసి చూసితి నయ్య
        విన కూడనివి నెన్నొ వింటి నయ్య
తలచరానివి చాల తలచితి నో స్వామి
        చూడదగని వెన్నొ చూచి నాను
బోలెడు బొంకులు బొరెలను నోటన
        నన్య కాంతల జూచి నయితి పాపి
పశువులా బ్రతుకు నే బ్రతికితి నో తండ్రి
       పరమున కేపాటు పడను లేదు
తే ll 
ఇట్టి వాడని నీరక్ష యీయ కున్న
భక్త రక్షక బిరుదును బలక నేల
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll. 13

సీ ll
పుణ్య పురుషులందు పురుషోత్తముడు వారి- 
        కోసమున జగతి కొచ్చు వాడు
సురుల నాపద లెల్ల చూచి రక్షించుచు 
        భూభారమును బాపు భూపతుండు 
రాక్ష సాంతకుడు శ్రీ రఘువంశ ధాముడు
         మునుల మానసమున మూలనుండు
ప్రహ్లాద వరదుడు పాంచాలి వలువడు
         మానుష రూపుడు మాయపతుడు
తే ll 
అట్టి దేవుని కొనియాడ యవని తరమ 
శక్తి కొలదిగ దలతును చక్ర ధరుని
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  14

సీ ll
సకల భువన పాల సంసార మోచన
        సురనాయకార్చిత సుంద రాంగ
వేద వేద్యుడ దేవ వేద నారాయణ
       నేలు మమ్ము స్వామి నెపుడు నీవు
నారద నుతదేవ నారాయణా మూర్తి
       నరసింహ నరసింహ నన్ను కావు
వేణుగాణవిలోల వేణుగోపాలుడ
        సకల ప్రాణ నిలయ స్వామి రంగ
తే ll 
సకల పాలక దేవవో సాక్షి వీక్ష
దలతు  నిన్నిట్లు మనసున దాన వాంత
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  15

సీ ll
బోయవాని వలలొ బొంతులుండుట జూచి
           వలను గానక పక్షి వాలి నట్లు
గాలంబులో ముళ్ళు గానక మాంసంబు 
         తిన్న మీనము లాగ నున్న మయ్య
ఎండ మావుల చూసి నెంచి నీరనుకొని
        వెంబడించిన మోహ వెర్రి మాది 
పాము నోటిన కప్ప పడిన రీతిన మేము
        నీ మాయలో జిక్కి నిలచి నాము
తే ll 
ఇట్టి సంసార జలమును యిమర చేసి
భక్తి నీమీద నిలుపంగ బ్రతుక జూడు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll    16

సీ ll 
జగములన్నియు నీవె జయకారణము నీవె
          పరదేవతవు నీవె పరము నీవె
సురనాయకుడ నీవె శుద్ద తత్వము నీవె
         మంత్ర బలము నీవె మహిమ నీవె
విష్ణుమూర్తివి నీవె  విశ్వంబరుడ నీవె
         దయకు నిధివి నీవె ధాత నీవె
దామోదరుడ నీవె దాన వాంతక నీవె
        మాయ నీవెయు దిక్కు మాకు నీవె
తే ll 
సకల జగములందున మాయ శక్తినీవె
మాయ సంసార చీకటి మాపు నీవె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    17

సీ ll
కైవల్యనాథ నీ కమనీయ నామాంబు
        తపనతో నోరార తలచు చుంట
కల్పితంబనుకోకు కళ్ళనీరివి తండ్రి
        కలము నాపకు దేవ కమల నాభ
కడుపాపినని నన్ను కరుణించ కున్నచో
       కదలనిక్కడ నుండి కరుణ ధామ
లోక రక్షక నాదు లోపంబు లెంచక
       నన్ను గావుము తండ్రి నళిన నేత్ర
తే ll 
ఇవ్వి దంబున నీ చింత యిలన జేయ
భాగ్య మొనరించు శ్రీనాథ భక్తి మీర
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   18

సీ ll
మనిషి జన్మము నెత్తి మాటలొచ్చిన గాని
          మాధవ యనరేమి  మనసు నిల్పి
మాట లెన్నియొ వచ్చు మాట నిపుణతొచ్చు
       రంకు బొంకుల మాట రమ్య తొచ్చు
వెసన చాడీలెన్నొ వేలు వేలుగ వచ్చు
        వ్యర్థ మాటల పొందు వరుస వచ్చు
హరిహర యనినోట యనగ నేలను సిగ్గు
          శీలంబు పోయిన సిగ్గు పడరు
తే ll 
వింత మాటల విషయంబు విడిచి పెట్టి
దిట్టముగ జెప్తు నామంబు దిన దినమును
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    19

సీ ll
యజ్ఞయాగము కన్న యతి యత్నమున కన్న
          కృష్ణ నామము బల్క కృషియె మేలు
బహుతీర్థ యాత్రలు బడలితో చేలేక 
         విష్ణు దేవ కథలు వినుట మేలు
ముక్కుమూసుకు యోగ మునితపంబుల శ్రమ
          రామనామము చెప్ప రాదు జన్మ
భావ శుద్ధిగ బల్కు భక్తితోన బలుకు
         నామమందరి కిచ్చు నమ్మ పరము
తే ll 
సంతతము హరి కీర్తన సలుపు వాని
భావ చిత్తంబు నందున బ్రహ్మ ముండు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   20

సీ ll
కర్మ మార్గంబున కడదేరు దామన్న
          కాయంబు నొప్పదు కష్ట మునకు
భక్తితో నినుగొల్చి బతుకుదా మనుకొన్న
        మాయ సంసారము  మరపు చేయు
యోగ మార్గము బోయి యోగిగా ననుకొన్న
        గురుతు జూపెడి యోగ గురుడు లేడు
సూక్ష్మ జ్ఞానము తోన చూడాత్మ నన్నను
         సూక్ష్మ నాత్మను బుద్ది చూడ లేదు
తే ll 
ఏమి రానివాడను దేవ యేలు తండ్రి
ఎట్టి నియమము నామీద నెట్ట బోకు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    21

సీ ll
మదనగోపాల నా మనవి వినగ వేమి
        దానవాంతక దయ దలచ వేమి
నారాయణా మూర్తి నాగోడు వినవేమి
        బలరామ సోదర బలుక వేమి
ప్రహ్లాద వరద హే పాలించ రావేమి
        పాహి పాహి యనిన పంత మేమి
పరమ పావన దేవ పశువు నే నైనను
       పరము నీయు వరకు పంత మిడను
తే ll 
ఎంత వేడిన నామీద పంత మేమి
సుంత యైనను పరమును చూప వేమి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   22

సీ ll
పుణ్యమెరుగ నోడు పూజచేయని వాడు
        హరి కటాక్షము కెట్లు హర్హు డగును 
విష్ణు దలచనోడు వినవిధేయత లేని
          హరి కటాక్షము కేట్లు హర్హు డగును
మనసు కరగనోడు మంచి చేయని వాడు
         హరి కటాక్షము కెట్లు హర్హు డగును
నారాయణాత్ముని నమ్మి యుండని వాడు
        హరి కటాక్షము కెట్లు హర్హు డగును
తే ll 
భజన చేయక దేవుని భక్తి లేక
హరిని చేరంగ నాతడు హర్హు డగున
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    23

సీ ll
పుడమి పులకరించ పుణ్యంబు చేయుమా
        భారతావని మెచ్చ బ్రతుకు బతుకు
ధరలోన దీనుల దయాజూడ గలిగుండు 
        మంచితనము నీవు మరువ కున్డు 
సాధు సజ్జనులతో సఖ్యత గలిగుండు 
        జగడ మాడక నుండు జనులయందు
శక్తి కొలది నైన సాయంబు సేయుము
         శాంత చిత్తము తోన సాగ బతుకు
తే ll 
ఇట్టి జీవన నిష్టయే యిచ్చి రక్ష
ఇహము నందునె యివినీకు యింద్ర మౌను
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    24

సీ ll
భారమై బ్రతకొద్దు భార్యతో గొడవద్దు
         తిట్టి నోళ్ళ తిరిగి తిట్ట వద్దు 
చేతి కందిన జన్మ చేజార్చు కోవద్దు
        చేయరాని పనులు చేయ వద్దు
ఆలి కెపుడు నీవు యల్పుడై బతకొద్దు
        నధిక నప్పులు జేసి నలగ వద్దు
చెడువానిగ జనులు చెప్పంగ బతకొద్దు
        మనసున మంచిని మరువ వద్దు
తే ll 
భాగ్య శాలిగ బ్రతికి యీ భవము దాటు
వీర ఘణసూర వైష్ణవ విజయ తేజ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    25

సీ ll 
తల్లి దండ్రియు నీవె తరునోప మున్నీవె
         ముక్తి నొసగు దయా మూర్తి నీవె
తత్వయోగము నీవె తంత్ర మంత్రము నీవె
          ప్రజల పాలన చేయు ప్రభువు నీవె
లోక రక్షక నీవె లోకేశుడవు నీవె
           గంగోద్భవము పాద గయను నీవె
ఇహపరంబులు నీవె యిష్ఠ దైవము నీవె
           సర్వ వ్యాపక మైన సాక్షి నీవె
తే ll 
నీకు సరితూగు దైవంబు నీకు నీవె
మాకు మాయను తొలగించ మహుడ నీవె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   26

సీ ll
పూర్వజన్మము నాటి పుణ్యమేమియు లేని
          మెప్పుగా నినుగూర్చి చెప్ప గలన
తోచునా యోచన దొరకునా నీదయ
           నాచంద మెరుగవా నళిన నాభ
ఏతీరు బాడిన నీతీరు కోసమే
          నాతప్పు లెంచకు నారసింహ
బాగుగా నినుజెప్ప బ్రహ్మ కైన తరమ
         నిన్ను పొగడగ నే నెంత వాడ
తే ll 
చక్రి నినుదప్ప యే గొప్ప చప్ప నప్ప
అప్ప నామీద నేరాలు నొప్ప కప్ప 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   27

సీ ll
గొప్పగా గణితంబు చెప్ప నేర్వగ వచ్చు
         నిన్ను చూడగ జెప్ప నేర్చు టరుదు
జగతిలో రారాజ జన్మ వచ్చిన గాని
          నీదాస దాసుగా నిలుచు టరుదు
జగతిలో నెంతైన చదువు చదవ వచ్చు
        నిన్ను చేరు చదువు నేర్చు టరుదు
జగతినంత నొకడు జయము పొందగ వచ్చు
         నీదుమాయను గెల్చి నిల్చు టరుదు 
తే ll 
పతిత పావన కనుక నీ పాదచింత
నాకు దయసేయు మో తండ్రి నంద నంద
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ శ్రీ రంగనాథ ll.   28

సీ ll
పలుమార్లు నామంబు పలుకు చుండెడి  వారు
          వీరిచే నీకథల్ వినెడి వారు
నిరతంబు నీ చింత నిడువ కుండెడి వారు
          వీరి గాన మెపుడు వినెడి వారు
సతతంబు నీకును సత్పురుషులకును
         సేవలు నిత్యంబు సేయు వారు
శ్రద్ధతో వ్రతమున చరియుంచు వారును 
         నీద్యాన మందున నిలుచు వారు
తే ll 
నీదు భక్త జనుల కెల్ల నీవె యండ
నుండ భారంబు మోయంగ నుండి నావె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   29

సీ ll
ముదిత తపసు డైన మునిమౌన యోగైన
           భక్తి భావము లేని భాగ్య మెట్ల
దానంబు దండిగా దయచూపి నోడైన
          భక్తి భావము లేని భాగ్య మెట్ల
యజ్ఞ యాగము లెన్నొ యాచరించిన గాని 
           భక్తి భావము లేక భాగ్య మెట్ల
బగలురేయి భజన పలికిన వాడైన
         భక్తి భావము లేని భాగ్య మెట్ల
తే ll 
భక్తి భావము లేని యే పనులు యైన
చేయ బూనను స్వామి శ్రీ చెన్న కేశ 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   30

సీ ll 
శ్రీ హరి నీమాయ శివుడుయే కనలేక
          భామగా దలబోసి భ్రాంతి జెంది 
నీయంద చందాల నీ మోహనాకార
        వలుకు కులుకు చూసి వలచి నాడు
నారదు డలనాడు నారీమణికి జిక్కి
        నారుపదుల సుతుల్ నయ్యె తండ్రి
నీమాయ గనలేక నిఖిల లోకంబులు
       మాయ సంసారాన మగ్గి నారు
తే ll 
నట్టి నీమాయ దాటంగ నగున నాకు
శరణు జొచ్చెద కావున చక్ర ధారి 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    31

సీ ll
పవన సుతున పాల పాంచాలి రక్షక
          నాగారి వాహన నమ్మ నీవె
సిరినాథ వో స్వామి శ్రీ మహా విష్ణుడ
        రాక్ష సాంతక నాకు రాజు నీవె
సీతమ్మ మెచ్చిన శ్రీ రామ జయరామ
         రఘువంశ రత్న మా రక్ష నీవె
అష్ట పత్నుల దేవ యష్ట గర్భోద్భవ
        అష్టమి తిథి జన్మ  యన్ని నీవె 
తే ll 
నాకు నన్నియు నీవని నమ్మి నిన్ను
వేరు దైవంబు నెప్పుడున్  వేడ తండ్రి
అవని నా లూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   32

సీ ll
పుట్టిన వంశాన పుడమిన కీర్తికై
        మంచి పనులు చేయ మనిషి కాను
తల్లి దండ్రులసేవ దలచి చూడని నాకు
       సుతునిగా నపకీర్తి చూప బడితి
గయ్యాళి గొడవతో గడపిన జన్మాన
         భర్తగా నోర్పును బట్టినాను
తనయుడు చేసెడి తప్పు లన్నిటికి నే
       తండ్రిగా చెడ్డను తట్టు కొంటి
తే ll 
నాకు నపకీర్థి కలగక నన్ను గావు
కంస మర్ధన దేవవో  కరుణ నీదె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   33

సీ ll
ఇంటి పెద్ద నయిన యిల్లాలి పతి నైన
        నీపాద దాసునై నిలచి తయ్య
తనయు లందరికి నే తండ్రినైనను గాని
         నాకు తండ్రివి నీవె నళిన నాభ
పట్టణ ప్రజలకు పాలకున్నే నైన
          నాకు ప్రభువు నీవె నంద కొమర
అయిన వారికి మించి నధిక ధనము నున్న
          నీసేవ భాగ్యమే నిక్క ధనము
తే ll 
ఇట్టి సంపద పరమును యివ్వ దగున
మోక్ష మీయని యవియేల మోహ నాంగ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   34

సీ ll
ధనము కోసమని నీ దరికి నే రాలేదు
        కోరి వరము లివ్వ గొల్వ లేదు
జన బలంబునకు నే జగడ మాడగ లేదు
           పదవి నిమ్మని పట్టు బట్ట లేదు 
మణి మయంబులకని మభ్య పెట్టుట లేదు
      అప్పు నిన్నెపుడు నే నడుగ లేదు
అధికార మిమ్మని నడ్డు నే పడలేదు
           అట్టి వే మియు నిన్ను యడుగ లేదె 
తే ll 
నిన్ను సేవించు భాగ్యంబు నీయ జూపి
నన్ను కరుణించ నెంచిన నదియె చాలు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   35 

సీ ll గోకుల మందున గోప కాంతల దొర
           వెన్న దొంగవె కాదె వన్నె కాడ 
చాటు మాటును వీడి సాకారమును దాల్చి
             సద్గతిన్ గల్గించు సాధువులకు
వైకుంఠ మెక్కడో వాసంబు నేదియో
             ఎట్లు యెరుగుదుమో యెంక టేశ
నిన్ను  కానగ లేక నీభక్త  జనులెల్ల
             వెదకి వెదకి చాల వెతన బడిరి
తే ll 
ఉండు సుకుమార నాదగు నుల్ల మందు
నిక్కముగ నివసింపుమో నీర జాక్ష
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   36

సీ ll
నీనామ భజనచే నిత్య సంభాషణ
        పావనంబయి పోయి పండి పోయె
నీపూజ చేసిన నిత్య కర్మలుకూడ
       పావనంబయి పోయి పండి పోయె 
నీచింతనలు తోన నిత్య చిత్తంబెల్ల 
        పావనంబయ పోయి పండి పోయె
నీదివ్య రూపంబు నిత్య ధ్యానమ బుద్ది
        పావనంబయి పోయి పండి పోయె 
తే ll 
పండి పోయిన చిత్తంబు పరము నిచటె
దివ్య శాంతిని పొందుచు దినము గడుపు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     37

సీ ll
భజన ప్రియుడ వన్చు భక్తితో కొందరు
         భజన చేసిరి నిన్ను భక్తి మీర
మూల మీవెననుచు మునిమౌను లెందరో
          మానసంబున తత్వ మాన్యు లైరి
యోగీశ్వరుడ వన్చు యోగమార్గము బోయి
           యోగ సిద్ధిని పొంది యోగు లైరి
సత్యంబు నీవని సకలంబు నీవని
             సాదు సజ్జను లంత సత్యు లైరి
తే ll 
కడలి నందున నదులెల్ల కలిసి నట్లు
దారు లేవైన జగతికి ధర్మ మొకతె 
అవని నాలూరు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    38
          
సీ ll
గొప్పగా నీపూజ మెప్పుగ సేలేదు
        జపమాల దిప్పలె జపము నందు
అభ్య సించను లేదు హఠయోగ మెప్పుడు
         మునుపు తీర్థాలలో మునగ లేదు
నీ కోవెలకు బోయి నీదివ్య రూపంబు
         కన్ను లారగ నిన్ను గాంచ లేదు
భక్త గణము చేరి భజన చేయను లేదు
            చెన్న కేశవనుచు  చెప్ప లేదు
తే ll 
నేమి పుణ్యము చేయనన్నేల వేమి
కాన నామీద నీకింత కక్ష నేల
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    39

సీ ll
సకలాత్మ నీవని స్మరణ చేసితి 
          పద్మనాభుడవని పట్టు కొంటి 
మూలంబు జగతికి ముఖ్య మీ వనుకొని
           శరణార్థ కుడనునై శరణ మంటి
భద్రాద్రి రాముడ భజన చేసితి నీదు
          పతితపావన పాహి పాహి యనుచు
దయగల స్వామని దండంబు బెట్టితి 
            భక్త పాలుడవ నీ భక్తి గుంటి
తే ll 
అన్య మెరుగక నీనామ మభ్య సింప
శక్తి నొసగుము శేషాద్రి శయన వాస
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    40

సీ ll
నోరార నినువేడ నొక్క దినము లేను
      తిరుమ లేశున యర్ధ దినము లేను
పరుల సేవల యందు పాతి కైనను లేను
        యదు పూజలో నుదయంబు లేను
నీకు నర్ఘ్యము నిచ్చు నియమ సంధ్యను లేను
        గడియ యోగంబున గడుప లేదు
నీమీద చిత్తంబు నిమిష మైనను లేను
        మదిలోన నినుదల్చ మతికి లేదు
తే ll 
వట్టి పాపాత్ముడని నన్ను వదలి నావ
పతిత పావన దేవ మా పాల దేవ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   41

సీ ll
సంసారమును దాట సాగర నావని
         నీపాద చరణాన నిలచి నాను
ఘోర పాపము బాప గోవిందు నీవని
         పూజ తీర్థము నోట పోసి నాను
నీబంటుగా నేను నీకు సేవలు చేసి
          నిశ్చింతగా యిల నిలచి నాను
నీవెదిక్కని నమ్మి  నిత్యము నినుగొల్చి
          యుందు నే నీపాద యుగళి చెంత
తే ll 
పరమ పావన పల్లవ పాద యుగళ 
పరము కోసము నేను నీపాల బడితి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  42

సీ ll
పలుమార్లు వేడితే పలుక వేమయ తండ్రి
          పడుకొన్టి వా దేవ పాము పైన
కమలోద్భవ జనజ కరుణ చూడగ వేమి
           కమలంబు లోకదా కనులు నీకు
చేరదీయ మనుచు కోరిన వినవేల
           శంఖంబు చేతుల చక్ర ముంద
మురళి గానవి లోల ముక్తి నీయమనిన
       ముని గణంబున నీవు మునిగి నావ
తే ll 
విజయ జయచంద్ర నీ కిట్లు వీలు లేద
కారణంబును జూపి నన్ గావ వేమి 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   43

సీ ll నీమాయ లీలలు నీ మనో సరళిని
           ఎవడైన లోకాన యెరుగ గలడ
వేదంబు లెల్లయు వెదకి చెప్పను లేరు
           నిన్నెంచి చెప్పంగ నిల్వ తరమ 
పరిపూర్ణముగ నీదు భావంబు నేదియో
       ఎరగ గల్గిన వారు యెవరు గలరు
మునిమహా మహులెల్ల మూలంబు దెలియక 
        తల్ల కిందుల బడి తపము చేయ
తే ll 
అట్టి లోకేశ నినువేడి ననవ రతము
పాద సన్నిధి నిలిచుందు పంక జాక్ష
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ శ్రీ రంగనాథ ll.     44

సీ ll 
నీమీద బుద్ధిని నిలుచు నట్లుగజూడు
             భావంబు భక్తిన భద్ర పరచు
నోరు నీ కీర్తనల్ నుడువ నుండగ చూడు
           చేతుల పూజలు చేయ జూడు
వీనులు నీ కథల్ వినునట్లు జూడుము
        సేవ కాయంబుతో  సేయ చూడు
 కనులకు నీరూప కమ్మ ధనము చూపు    
         తలను నీ పాదాలు తాక చూడు 
తే ll 
ఎపుడు సేవలు చేయుచు యెదగ జూడు
నిత్య సత్య నివాస హో నీర జాక్ష
అవని నాలూరు కో నన యలరు చున్న
రావ నన్గావ శ్రీ రంగనాథ ll.     45

సీ ll
కైలాశు నర్చించ కమళ నేత్రము బీకి
         వేయి పద్మము లందు వేసి నావె
మోహినీ రూపాన మోహంబు కల్పించి
         శృంగార రసముసూపంగ చేయ
నటరాజు రసరమ్య నాట్యంబు సేయగ
          మద్దెల్లు వాయించి మద్దతమున
నీలవర్ణ శరీర నిటలాక్షు పూజలో
           నీవగ్ర జుండవై నిలచి నావె 
తే ll 
నీదు ఘణ పూజల శివుడు నిన్ను మెచ్చి
పాల లోకాధి పతినాథ పదవి నిచ్చె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   46

సీ ll
పాంచాల్ని సభలోన పరువుగా పాడిన
       పతిత పావన దేవ పాహి పాహి
సవ్యసాచికి గొప్ప సందేశ మిచ్చిన
       పక్షి వాహన దేవ పాహి పాహి
గోవర్ధనము నెత్తి గోవలన్ గాచిన
       పసుపాల బాలక పాహి పాహి
రణరంగమున గొప్ప రావనున్ జంపిన
        భక్త సన్నుత దేవ పాహి పాహి
తే ll 
భక్త మందార నిన్నిట్లు పలికి పలికి
దాటు కొందును యీ జన్మ ధన్య ముగను
అవని నాలురు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   47

సీ ll
నారాయణా నిన్ను నమ్మిన భక్తుల
       వారి కాళ్ళకు జేతు వంద నములు
దామోదరా నీకు దాసత్వమును చేయు
        వారి కాళ్ళకు జేతు వంద నములు
గోవింద గోవింద ఘోష చేయుచు నున్న
        వారి కాళ్ళకు జేతు వంద నములు
పురుషోత్తమా నీకు పూజచేయుచు నుండు
        వారి కాళ్ళకు జేతు వంద నములు
తే ll 
నీదు దాస జనుల కాళ్ళ నిత్య ముండి
దాసులకు దాసుగా నుందు ధరణి లోన
అవని నాలూరు కోనన యలరు చున్న
రా వ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    48

సీ ll
నందన వనమైన నంద రాజుని యింట 
        పుట్టిన పుణ్యాత్మ పురుష శరణు
కాళంగి మడుగున కాళీయు ననచిన 
          కౌస్తుభ మణిహార కనుక శరణు
దేవగణా పక్ష దేవకీ వరపుత్ర
          మహితమన్ శిశుపాల మర్ద శరణు
పాండుసుతుల కంట పరిరక్ష చేసిన
             పరగ రాజ శయణ బడితి కాళ్ళ
తే ll 
నమ్మగా నీవె నగధరా నాకు శరణు
శరణు శరణాగతా రక్ష శరణు తండ్రి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    49

సీ ll
పరమేశు నెటులైన పలికిన వారికి
         పరము కేమి కొదువ పాపి కైన
నవ్వు కొనుచు నైన నారాయణా నన్న
        పరము కేమి కొదువ పాపి కైన
భక్తితో యన్నను భవ భందమున నన్న
        పరము కేమి కొదువ పాపి కైన
వైరంబు తోనన్న వలపుతో తలచిన
        పరము కేమి కొదువ పాపి కైన
తే ll 
అట్లు నీనామ మెట్లైన యనిన నంత
మోక్ష మలరంగజామిల్డె  సాక్షి మాకు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    50

సీ ll
జగతిలో నుండెడి జనుడెంత వాడైన
           నిన్ను దూషించు వా నింటి కెలను
కడుబీద వాడైన కటిదరిద్రుండైన
            నీ భక్తులగు వారి నింటి కెలుదు
సాదు సజ్జనులకు సాయపడని వారి
          చెలిమి చేయను తండ్రి శేష శయన
దండిగా ధనముండి దాన మీయని వాని
       దయను కోర నెపుడు ధర్మ రక్ష
తే ll 
నిన్ను నీదాస జనులను నింద జేయు
వారి వద్దకు యెళ్లను వశుధ నెపుడు 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ శ్రీ రంగనాథ ll.     51

సీ ll
దరణిలో లోభులు దయజూప రెంతున్న
         ధాత ధనము నున్న దాచు కోడు 
కఠినాత్మున కెటుల కారుణ్యముండునా
          కాటికాపరి తన కాసు విడున
దొంగవారల కెట్లు తోచు నీతి గుణము
          హింస చేసెటి వారు హితము వినరు
పరసొమ్ము కోసము ప్రాకులాడెడి వారు
          పరువు ప్రతిష్టను పట్టు కొనరు
తే ll 
వశుధ ధర్మమునకు వీరు వైరు లగుచు
కాల గర్భంబులో కర్మ గతిన పడిరి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    52

సీ ll
ఆశ్రిత పరిపాల మభయ వరదరాజ
        మాతప్పు లన్నియు మాపు తండ్రి
నరసింహ నరసింహ నారద నుతదేవ
         మాతప్పు లన్నియు మాపు తండ్రి
గోవింద గోవింద గోకుల మణిరత్న
          మాతప్పు లన్నియు మాపు తండ్రి
శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహర దేవ
           మాతప్పు లన్నియు మాపు తండ్రి
తే ll 
తప్పులన్నియు మన్నించు తండ్రి వీవె 
దానవా వైరి నన్బ్రోవ దరున మిదియె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    53

సీ ll
నామంబె ముక్తికి నతిసుల్వ మార్గంబు
           జనులకు చేరువ జగతి లోన
హరినామ చింతచే దరినున్న పాపాలు
           కర్పూర హారతై  కరిగి పోవు
గోవింద నామాన క్రూరున కైనను
          తప్పక మోక్షంబు తనకు గల్గు
రామ నామము మహా రాజమై వర్ధిల్లి
        జగతికంతయు మహా జయము నిచ్చె
తే ll 
అట్టి తారక మంత్రంబు ననవరతము
జపము చేసిన శ్రీహరి కృపను కల్గు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    54

సీ ll
మోక్షాధి పతివనీ మ్రొక్కితే  నామీద
          పంతంబు బూనిన పారి పోను
దీన బాంధుడవని దినము పూజించితే
            దిక్కరిస్తివి నన్ను దీన రక్ష
నరులకు స్వామని నమ్మి తే నాయందు
            కోప మేలను తండ్రి కోన రంగ
నాస్వామి నీవని నచ్చినిన్ వేడితే
          కావనంటివి నేల కరుణ సింధు
తే ll 
వీలు కాదన్న నిన్ను నే విడువ నయ్య
కడలి కెరటంబు నొక్కలా కలిసి పోమ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  55

సీ ll
కౌసల్య సుత నీదు కైవల్య మాసించి
      కాపు కాచితి దేవ కమలనాభ
పరము నిచ్చుదు వని పాదంబు బట్టితి
         దయగల వాడ నీ దాపు కొస్తి
కష్టమా కావగ నష్టమా బ్రోవంగ
         కష్ట నష్టము జెప్పు కంజ నేత్ర
భారమా నీకు నే భద్రాద్రి రఘురామ
        బాగ యోచించ వో భక్త వరద
తే ll 
పాహి శరణన్న నామీద పంత మిడిచి
శీగ్ర మేగావ రావయ్య శ్రీని వాస
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  56

సీ ll
బంధుబలగ మెంత బలముతోడుగ నున్న
          సచ్చి పోవునపుడు సాయ పడరు
అధికార మెంతున్న నవనికి రాజైన 
           పరమునకవి యేవి పనికి రావు
సుతులునెక్కువ నున్న సుందరంబుగ నున్న
           పాప మించుక నైన బాప లేవు
ఇంట బలగమున్న యింటివైద్యులు నున్న
          మరణమయ్యు వ్యాధి మాన్ప గలర 
తే ll 
మోక్ష మీయని సంపద మోయ నేల
అట్టి వాటికి మానంద మంద నేల
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    57

సీ ll
మశ్చావ తార నా మాటవినగ వేమి
         నరసింహ బాగునన్ నడగ వేమి
నారాయణా స్వామి ననుబల్క రించవే
         బలబద్ర సోదర బలుక వేమి
కూర్మావతార నా కుశలమడగ వేమి
       దామోదర దయను దలచ వేమి
గోకుల చినబాల గోడును విన వేమి 
          శ్రీహరి నాకిట్టి శిక్ష యేమి
తే ll 
కనక కుండల భూషణ కణికరించి
కావ రావయ్య వేగ నీ గమ్య మిడిచి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ శ్రీ రంగనాథ ll.     58

సీ ll 
ఐశ్వర్య మేమియు యధికార మెంతయు
         వస్తు వాహనములు వలదు తండ్రి
ధనదాన్య  రాసులు ధగ ధగ కనకంబు
          తలకు మకుటమైన వలదు తండ్రి
భూసంపదలు గాని భువనపాలన గాని 
          అశ్వ గజము లైన యడుగ నెపుడు
నిన్ను దూరము చేయు నిఖిల లోకమునున్ను
          ఏవి యడుగ నిన్ను యెపుడు తండ్రి 
తే ll 
మదిన నీపాద యుగళంబు మరువ కుండ
నామనో భావమున నీవు నడయ చాలు
అవిని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     59
    
సీ l l
సభమెచ్చె ననినీవు సంతసించగ రాదు
          విభవంబు నమ్మి గర్వింప వలదు
తల్లిదండ్రుల మీద దప్పు లెన్నగ రాదు
         సత్బ్రాహ్మణుల తోడ జగడ మొద్దు 
తల్లి దండ్రుల మీద దప్పు లేయగ రాదు
         మంచి జేసిన వార్ని మరువ వలదు
ప్రాణి హింస కెపుడు బాల్బడగను రాదు
         చెడు వారితో జెల్మి చేయ వలదు
తే ll 
సజ్జనుల తోన హాస్యము సలుప రాదు
వేయి శ్రమలున్న నీతిని విడువ రాదు
అవని నాలూరు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   60

సీ ll
ధనము సంపాదింప ధరణి నేమియు గొప్ప
        భక్తితో యిలతాను బతుక గొప్ప
నిధిని కాపాడంగ నిలన నేమియు గొప్ప
         చిత్తాన హరినామ చింత గొప్ప
గగన విహారంబు ఘనత నేమియు గొప్ప
          మనసు మంచిగ తాను మలచ గొప్ప
మంత్ర విద్యలు నేర్వ మహిన నేమియు గొప్ప
           నిత్య ధర్మము నందు నిల్వ గొప్ప
తే ll 
గొప్ప తనమెల్ల గోవిందు గొల్చు టందె
కల్గి యుండుము కడదాక కంద బాల 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    61
 
సీ ll
దినకర శశినేత్ర దివ్య సుందర రూప
          ఇందిరా రమణ గోవింద వరద
కంస మర్ధన దేవ కరిరాజ పరిపాల
          ఇందిరా రమణ గోవింద వరద
సురరాజ సేవిత సుప్రసన్న వదన
          ఇందిరా రమణ గోవింద వరద
గగన సదృశ రూప కారుణ్య రసపాత్ర
       ఇందిరా రమణ గోవింద వరద
తే ll 
దివ్య వైకుంఠ పురవాస దీన పాల
భక్త వత్సల నాపాల బద్ర శైల
అవని నాలూరు కోనన యలారు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   62

సీ ll
వరదరాజ స్వామి వైకుంఠ పురవాస
          వామన దేవుడ వంద నాలు
కాంచీపురానాథ కంజలోచన దేవ
       వరలక్ష్మి  హృదయేశ వంద నాలు
అభయహస్తము తోన నుభయభామల మధ్య
        నందన వన భోగ వంద నాలు
శరణాగతా రక్ష శంకు చక్రాధర
        వరదాభయా ముద్ర వంద నాలు
తే ll 
విష్ణు కాంచీపురాశ్రిత విశ్వ రూప
వినుము ధీనుని వేడుక విమల చరిత
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   63

సీ ll 
మనిషినై పుట్టిన మానుగా పుట్టిన
          కోతినై తిరిగిన కొంగ నైన
జలచరాలదిరుగు జన్మయేదైనను
      చీమనైనను గవ్వ చిల్లి నున్న
పశువునై పుట్టిన పక్షిగా యెగిరినా
        జగతి వనక్రూర మృగము నైన
ప్రభువు నై పుట్టిన పల్లకి మోసిన
      యేజన్మలో నున్న యెక్క డున్న
తే ll 
పద్మ దళనేత్ర నీపాద పద్మ మందు
భక్తి కలుకంగ చేయుము భక్త పాల
అవని నాలూరు కోనన యాలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll. 64

సీ ll
కష్టాల కెన్నడు కలత చెందకు నీవు
         ఓర్పుతో దానిలో వొదిగి పొమ్ము
అపవాద మోసినా రాముడంతటి వాడు
          అడవిన సీతను విడువ లేద
జగమున నలరాజు చక్రవర్తిగ నుండి
          పడరాని పాట్లను పడను లేద
పంచపాండవు లెంతొ పౌరుషంబులయిన
           అడవులందాలితో నడచ లేద
తే ll 
అట్టి వారినె కష్టాలు హల్లు కొనగ
ఇట్లు యేపాటి వారము యిలన చూడ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   65

సీ ll 
నీమీద పరిభక్తి నిచ్చువాడవు నీవె
        మంచి మనసునీయ మాకు నీవె 
భవరోగమును బాపు పరమౌషదము నీవె
        ధర్మమందు నడుప తండ్రి నీవె
అంధకారమును దోయరున జ్యోతివి నీవె
         మూఢుండ నాకును ముక్తి నీవె
సత్యంబు బోదింప సద్గురుండవు నీవె
         జ్ఞాన మొందగ బుద్ది జ్ఞప్తి నీవె
తే ll 
నీవె శరణంబు నాకింక నిక్కముగను
కాన  కావగ రావవో కన్నతండ్రి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  66

సీ ll
బ్రతుకుదెరువు కోరి బతిమాల నెవ్వరిన్
        బ్రతికెద నీపాద పద్మ మందు
పరిరాజులింటన పనులు నే చేయను
         పరకతో గుడిలోన పాచి దుడుతు
రత్నముల్కోసమై రాజులన్బొగడును
          వారి గొప్పలు నేను  వ్రాయ నెపుడు
నీలీల గాధలు నిమిషంబు వినకుండ
           నుండజాలను తండ్రి దండ నాథ 
తే ll 
ఇట్లు నినుదప్ప వేరేమి యిలన నేను
చేయ బూనను తండ్రి వో శేష శయన
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    67

సీ ll
నందరాజ తనయ నామొర విను తండ్రి
        నరసింహ నా స్వామి నన్ను గావు
మురళి మనోహర మువ్వ గోపాలక 
        మునిసేవ్య వందిత ముక్తి నిమ్ము
కుంతీ సుతాపాల కూడదనకు కావ
       గరుడ వాహన భవ గడ్డ నుంచు
నారాయణా స్వామి నామ రసము నిచ్చి
        నయనంబులకు దోచు నళిన నేత్ర
తే ll 
ఏవిదంబుగ నైనను యేలు కొమ్ము
 విశ్వ పరిపాల పావన విఠల రంగ 
అవని నాలూ రు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    68

సీ ll
కపటసాధువులు నీ కరుణ పొందగ లేరు
          కలనైన నీరూపు కాన లేరు
వేష భాషల తోన వెలుగు చుందురె కాని
          భక్తి భావన నిన్ను బడయ రెపుడు
చక్క మాటల తోన  జనులను నమ్మించి
            భుక్తి గడుపు చుంద్రు భూమి యందు
కాషాయ వస్త్రముల్  కట్టు కొన్నంత నే
      యత్న మేమియు లేక యతులు కారు
తే ll 
అట్టి దుర్బుద్ధి మదిలోన యపుడు నాకు
కలుగ కుండగ చూడయ్య కన్న తండ్రి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ  శ్రీ రంగనాథ ll.    69

సీ ll
నీపద ద్యానాన నిల్వచేసిన బుద్ది
          మలినరహిత మైన మాన సంబు
నిత్యము భక్తితో నీకీర్తనలు బాడ
           పావనంబై నోరు పండి పోవు
కోవెల వనపూలు కోసి మాలలు కూర్చ
            చేసిన పాపాలు చెదరి పోవు
నీమహా లీలలు నిత్యము వివరింప
         యత్నము చేసిన యతుడు కాడ
తే ll 
జగతిలో భక్త జనులకు జయము నిచ్చి
పుడమి కాపాడ రావయ్య పుండరీక
అవని నాలూరు కోనన యలరు చున్న 
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   70

సీ ll
చిత్త మందున నిన్ను చింత చేసిన వారి
      పుణ్యమెంతయె చెప్ప పురుషు డెవడు 
నిరతంబు కీర్తన నిలచి చేసిన వారి
        పుణ్యమెంతయె చెప్ప పురుషు డెవడు
దరణీపతీ నీదు దాసులున్ జేసిన
          పుణ్య మెంతయె చెప్ప పురుషు డెవడు
ద్యానమందున నీదు ధ్యాస నిల్పిన వారి
         పుణ్య మెంతయె చెప్ప పురుషు డెవడు
తే ll 
అట్టి పున్యాత్మ మహిమయే హాయి నొసగి
జగతి కాపాడు చున్నది జనుల కెపుడు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     71

సీ ll
నరసింహ నీబలం సురగణంబు లెరుగు
         బంటుగా హనుమంతు భాగ్య మెరుగు
దైత్య రాజ సుతుడు దైవ శక్తి నెరుగు
          పాంచాలి నీ రక్ష భద్ర తెరుగు
ఘనపాద మహిమెంతొ గౌతమాళి కెరుక
           కావాగ నుత్తర గర్భ మెరుగు
అమిత సంపదనీయ నా కుచేలుడెరుగు
          గజరాజు నీరక్ష ఘనత నెరుగు 
తే ll 
ఏమి నినుగూర్చి సుంతైన యెరగ లేక
పాప చింతన చేసి నే పతితు డైతి 
అవని నాలూరు కోన న యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    72

సీ ll
పాము పానుపు వేసి పవళింపు సేయంగ
        పాము బట్టను లేను పంక జాక్ష
పక్షిరాజును బట్టి పయనమొందగ చేయ
         బోయ వాడిని కాను బోగి శయన
కమ్మని వెన్నతో కడుపునింపగ నేను
          యాదవ కులజన్మ మందు లేను
నదిని దాటింపగ నాకేపడవ లేదు
          బహుదాన మీయంగ బలిని గాను
తే ll 
దీన జనుడని నీకిట్లు దెలియ దేమి
వనజ పత్రాక్ష యో స్వామి వందనములు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    73

సీ ll
నవ్వులాట కొరకు నామమ్బు నా కొద్దు
        సద్గతివ్వని సంఘ శతక మొద్దు
భజనచేయని యట్టి భాగ్య సంపద లొద్దు
         భక్తి లేకుండ యే భావ మొద్దు
నడయదాసుని గాని నరజన్మ నా కొద్దు
         జనుల పాలింప యే జయము లొద్దు 
స్వామికార్యము లేని సమయంబు నా కొద్దు
         చక్రి చదువు లేని చదువు లొద్దు
తే ll 
ఘనముగా బల్కు నీనామ ఘనత చాలు
చెన్న కేశవ చరితంబు  చెప్ప జాలు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    74

సీ ll
అమితనాయుష్షును హనుమంతు కిస్తివే
         అమృతంబు నిస్తివే యమరులకును
కొడుకు ప్రాణములను కోరగా సాందీపు
          కిస్తివే గురువని యిలన నీవు
ద్రౌపది కిస్తివే దండిగా వలువల్ కు- 
           చేలున కిస్థివే చెప్ప నంత
సుగ్రీవు కిస్తివే చూడగా కిష్కింధ
          ఆ విభీషణుకిస్తి వంత లంక
తే ll 
ధాత వైన నిన్నడుగ నే తలచ లేదె 
సంత సంబున నీనామ స్మరణ జాలు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    75

సీ ll 
బలిసిన కాయాన బలమెంతయో నున్న
            కాలగర్భంబులో కరిగి పోవు
ధనమెంత కలిగున్న ధర్మము విడనాడ
           విడిచి పోవునదియు విశ్వ మందు
మునుపుచేసిన కర్మ మూలదాగిన గాని
          విలయమొందగ జేయ విడువ దెపుడు
కాయంబు కాంతిని  కాచి రక్షించిన
       ముడతలుమానవు ముదిమి యందు
తే ll 
ఇలన నుండవేవియు రాత్రి కలను లాగ
భావ మందున దలపోసి భద్ర పడుము
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ శ్రీ రంగనాథ ll.    76
          
సీ ll
పుణ్యాత్ము లందును పూజ్య భావమునుండు
            క్రూరాత్ములతొ జెల్మి  కోరకుండు
పరమాత్మ నామంబు పలుకవేడుచు నుండు
            పాపాత్ములను నోట పలక కుండు
విష్ణు భక్తుల కాళ్ళు విమలంబులని చూడు
            చోరుల ముఖమును చూడకుండు
హరిదాసులకు నీవు పరిదాసముగ నుండు
            నీచులింట గడియ నిలువ కుండు 
తే ll 
గరుడ రూడుని దప్ప నీ గురుని తప్ప
సాధుకాని వాని నెపుడు స్వామి యనకు 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   77

సీ ll
దామోదరా నీకు దాసజాలము దండి
         దండులో నన్బ్రోవ తలప వేమొ
భోగీంద్ర శయన హే పొగడు వారెందరో
            అందులో నా బాగు నడుగ వేమొ
గోకుల మణిరత్న గోప కాంతల నున్న
           గుంపులో ననుచూడ కుందు వేమొ
శరణాగతా రక్ష శయనించి నానని
            నిదురలో మరపున నుందు వేమొ 
తే ll 
పతిత పావన నిట్లుండ పలుక వేమొ
పావ నంబగు నీనామ పలుక జూడు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.     78

సీ ll
పరివార లున్నను  సిరిసంపదల్నున్న
        తనువువిడుచు వేల తరలి రావు
కూడుదినక కాసు కూడబెట్టిన వన్ని
          నావారికే దప్ప నాకు రావు
కడుపు కై చేసిన కష్టంబులేకాని
           కమళాక్షునకు పూజ కర్మ లేదు
చెడ్డపనులు చాల చేసినదేదప్ప
          మంచి కార్యమనెడి మాట లేదు
తే ll 
సాలు సంసార మికచాలు చాలు తండ్రి
జన్మ జన్మకు నీనామ జపము జాలు
అవని నాలూరు కొనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    79

సీ ll
ఎట్టి పాప విముక్తి యేవ్యాధి కైనను
          అష్టాక్షరీ మంత్ర మన్న జాలు
భవరోగ మునకైన భక్తి భావన కైన
           అష్టాక్షరీ మంత్ర మన్న జాలు
యోగంబు కొరకైన భోగాల కైనను
           అష్టాక్షరీ మంత్ర మన్న జాలు
తత్వసిద్ధికి నైన తపమాచ రించైన
            అష్టాక్షరీ మంత్ర మన్న జాలు
తే ll 
పావ నంబైన హరినామ పఠన మెంతొ 
భక్త జనకోటి సంరక్ష బలమె బలము
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    80

సీ ll 
తప్పులు మన్నించు తల్లిదండ్రియు నీవె
         దయజూడ నాకును దైవ మీవె
మానసయోగాన మాకు గురుడ వీవె
          మనసు నిలువ చిత్త మహిమ నీవె
పాపమంతయు బాపు భాగీరతీ నీవె 
           రాజ్యమేలగ మహారాజు నీవె
భాగ్యమెల్లయు నీవె భవము బాపుడ వీవె
           సంసారమున మాకు సామి నీవె
తే ll 
అఖిల లోకేశ నాకును యన్ని నీవె
ఆది మద్యాంత రహిత నా నాత్మ నీవె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    81

సీ ll
చెడుమాట లెన్నియో చెప్పిన నోటికి
        మధుర నీ నామంబు మనగ జేయి
వినకూడనివి యెన్నొ విన్న వీనులకును
         విరివిగా నీకథల్ విందు చేయి
విషయచింత లెపుడు వీడని చిత్తంబు
          నీపాద యుగలిలో నిల్పు మనసు
కాయంబుతో చెడ్డ కర్మలు చేసినా
             నీ పాద ధూళినై నిల్పు తండ్రి
తే ll 
ముందు చేసిన పాపాలు మూట గట్టి
శీగ్రమే కావ రావయ్య  శ్రీనికేత
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll     82

సీ ll
భక్తి భావంబుతో బాసురంబుగ నీదు
       పాదంబులను బట్టి బతుకు చుందు
అన్యచింతన లేక యలరుచు నీదివ్య
         చరితమే మనసున సలుపు చుందు 
నిత్యకాలము నందు నియమంబు దప్పక
        నీ పూజ చేయుచు నిలిచి యుందు
పగలు రేయనక యే పనుల నైనను మాని
          జపముచేయుచు నుంట జగతి నందు
తే ll 
నిత్య సేవలు చేయుచు నిరత ముంట 
చేర దీయగ దరిరమ్ము  చెన్న కేశ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    83

సీ ll
నీమీద పరిభక్తి నిజముగా జ్ఞానంబు
          నీయగల్గును కదా నీల వర్ణ
నీపాద చింతనల్ నిత్య కైవల్య మై 
          మానసాన పరము మాకు కల్గె 
నీమీద పద్యముల్ నిర్మల స్తోత్రముల్ 
          నీకు ప్రీతిని గొల్పు నిగమ వేధ్య
నీపాట పాడుచు నిత్యము జీవించ
           సుక్రుతం బేకదా సుజన పాల
తే ll 
భక్త వరదేవ నీమీద భక్తి నిచ్చి
యేలు కొనుతండ్రి మమ్ముల యెంకటేశ 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   84

సీ ll
శ్రీరంగనాథ నీ చిన్మయ రూపంబు
          ధ్యానించ యమరాజు దరికి రాడు
శ్రీరంగనాథ నీ సేవచేసిన వారి
         సంచితం బంతయు సమసి పోవు
శ్రీరంగనాథ నీ చింత చేసిన వారి
         దోషముల్ లెళ్ళయు దొలగి పోవు
శ్రీరంగనాథ నీ శీలంబు దలచిన
           భవజాల మంతయు బారి పోవు
తే ll 
భక్త పరిపాల నీమీద భక్తి చేత
మోద మొలరంగ చివరికి మోక్ష మబ్బు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    85

సీ ll
నీమీద స్తోత్రముల్ నిత్యగానము చేసి
          ప్రస్తుతింపగ నేను పండితుడన
విరివిగా నీపూజ వినయంగ చేయగ
          విప్రుండ నే గాను విమల చరిత
కలముచేతను బట్టి ఘనముగా నీమీద
           కావ్యంబు రాయనే కవిని గాను
భక్తిచే నినుకట్టి పడవేయు నంతటి
          భక్తి భావన సిద్ది బడయ లేదు
తే ll 
నిన్ను చేరెడి విద్య నే నేర్చ లేదు
కాన నినువేడ విడువను కంస వదన
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    86

సీ ll
నరజన్మ మందునే నారాయణను పొందు
           వేరు జన్మమునందు వీలు కాదు
కనుచూపు కాస్తయు కప్పిపోవక ముందె
           కమలనాభుని కళ్ళ కాన నగును
చెవుడురాక మునుపె చేసి శ్రవణమును
          ముక్తినొంద వలయు ముఖ్యముగను
కాయాన బలమెళ్ళ కరిగి పోవక ముందె
         తీర్థ యాత్రలు జేసి తీరవలయు
తే ll 
ముక్తి కిదిదప్ప యే జన్మమునకు నైన
వీలు కాదని హరిచింత విడువ కుండు
అవని నాలూరు కొనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    87

సీ ll
సవ్య సాచికి గొప్ప సాయంబు చేదల్చి
          రథముదోలితి వీవె రణము నందు
మిత్రున కైశ్వర్య మీయదలచి నోట
          అటుకులు ప్రీతితో యార గించ
దైత్యసుతుని మాట సత్యంబు సేయంగ
          పుడితివే స్తంభాన పుడమి నందు
పుండరీకుని భక్తి పుడమికి దెలుపంగ
           నిటుక రాతిన నీవు నిలచి నావె
తే ll 
చెన్న కేశవ నాకట్లు చేయుకున్న
నీదు నామంబు దలబుద్ది నీయు తండ్రి
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   88 

సీ ll
యోగ సిద్దిన పొంది యోగికావలె నన్న
         పరమాత్మ పాదాలె పరమ దిక్కు
మూలంబు కనుగొని ముక్తి నొందుట కైన
      పరమాత్మ పాదాలె పరమ దిక్కు
ధ్యానసాధన కైన జ్ఞానంబు కొరకైన
        పరమాత్మ పాదాలె పరమ దిక్కు
సాధుత్వ మునకైన సమర జయము కైన
         పరమాత్మ పాదాలె పరమ దిక్కు
తే ll 
పరమ సుభకరంబగు పాద పద్మయుగళి
లక్ష్మి సేవించ నెంచిన లలిత చరణ
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    89

సీ ll
బ్రహ్మంబు కైనను బ్రహ్మాండ మునకైనా
          నీవె తండ్రివి కదా నిఖిల నాథ
ప్రణవనాదము నీవె పరముక్తి యున్నీవె 
          సూర్య చంద్రుల నేత్ర చూడ నీవె
రాజుల పక్షాన రణజయంబున యుద్ద
          ధర్మ రక్షణ చేయు దయవు నీవె 
బలమున్న వాడికి బలము లే నోడికి
         బలము నీవె గదయ్య బ్రహ్మ జనక
తే ll 
రమణ దేవేశ మాపాల రక్ష నీవె
నీదు చరణంబులే ముక్తి నీర జాక్ష
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    90

సీ ll 
నీల మేఘశ్యామ నీ భక్త చిత్తుండు 
         జనులతో నెన్నడు జగడ పడడు 
మతిహీనుడని తన్ను మందలించిన గాని
         మానసంబున నేమి మండి పడడు
వెర్రివానిగ జూచి వెక్కిరించిన గాని
          యేమిననక వాడు యెళ్లు చుండు
తిట్టినా తిమ్మిన తిరుగు బో తన్నను
          చెవిన బెట్టడవియు చెంత రాడు
తే ll 
కమలనాభుడె నాకును కామ ధేను
యనుచు నిల్చును హారిభక్త జనుడు గాను
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   91

సీ ll
నీదాసు నంటినే నినువేడు చుంటినే
          పలుక వేమిటి తండ్రి పంక జాక్ష
నినునమ్మి యుంటినే ననుగావ మంటినే
         కావమేమిటి తండ్రి కమలనాభ
దైవమా నెప్పుడు దయజూడ మంటినే
         సూడవేమిటి తండ్రి సుంద రాంగ
మురహరి దేవేశ ముక్తి నిమ్మంటినే
         మభయ మీయగవదే మంబు జాక్ష
తే ll 
అఖిల లోకాథి నాథవో యమర పాల
చయ్య ననగ మోక్షం బీయ జాలు నాకు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.   92

సీ ll
నీమీద నాభక్తి నెవ్వ నెరుగ నొద్దు
         నీ వెరింగిన జాలు నిర్మ లాత్మ
నావారులందరు ననుమెచ్చ కున్నను
         నీవు మెచ్చిన జాలు నీర జాక్ష
నరులు నసూయతో ననుబాధ బెట్టినా
           నీదు కరుణ జాలు నీల వర్ణ
జడుడన్నను జనులు జంతు వన్నను గాని
         నీదు భక్తియె జాలు నిగమ వేద్య
తే ll 
నిట్లు నినువేడు కొనుట నే నీకు దెలియు
నన్ను రక్షింప నీవెని నాకు దెలియు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.    93

సీ ll
బోలెడు సంపద భోగుల కేగాని
         యోగసాధన జేయు యోగి కేల
విషయ విజ్ఞానము విప్రయో జనులకే 
          తత్వ సాధన జేయు తపసి కేల
మణిమయంబుల నిధి మహరాజులకె గాని
          ముక్తి కోసము నుండు మునల కేల
కనకపు వస్త్రంబు ఘన కుబేరులకేను 
           బిక్ష యాచన చేయు బిక్షు కేల
తే ll 
మంచి మనసున కేలనో మల్లె మాళ
చచ్చి నోడికి సత్గ్రంధ శ్రవణ మేల
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll    94

సీ ll
పుట్టిచచ్చుట కైన పుణ్యజన్మకు నైన
           కారణంబీవెగా కమలనాభ
మరపు తెరపులకు మాయమహిమ కైన
           కారణంబీవెగా కమలనాభ
శక్తి యుక్తుల కైన శమదమంబుల కైన
            కారణంబీవెగా కమలనాభ
పగలు రాత్రుల కైన ప్రగతి నడుచు టైన
            కారణంబీవెగా కమలనాభ
తే ll 
సకల కారణ దేవ శ్రీ సగుణ రూప
స్వామి నన్బ్రోవ రావయ్య సకల నేత
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   95

సీ ll
నారాయణ స్వామి నామొర వినవేల
          నీకు భక్తుని కాన నిత్య సత్య
వైకుంఠ మందుండి వనగ జేంద్రుని మొర
            ఆలకించితివెట్లు  నపుడు నీవు
దైత్యసుతుని మాట స్తంభంబు లోనుండి
            వింటి వెటుల నీవు వేద వేద్య
ద్వారక లోనుండి ద్రౌపతి మొర నీవు
             వింటివేరీతిన వేణు లోల
తే ll 
పక్షి వాహన నామీద పంత మిడిచి
వారివలె నన్ను రక్షింప వచ్చి చేరు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll    96

సీ ll
సూర్య చంద్రులు నీవె సురరాజు వున్నీవె
           జలరాసులున్నీవె జయము నీవె
భూమియగ్నివి నీవె భూపాలకుడ నీవె
             సత్వగుణము నీవె సాక్షి నీవె
ఆకాశమున్నీవె  నాత్మదేవుడ నీవె
           ముజ్జగంబులు నీవె మువురు నీవె
కాలరూపము నీవె కాలంతకుడ నీవె
             రాక్ష సాంతక నీవె రక్ష నీవె
తే ll 
కపిల ఋషినీవె కారుణ్య కంద నీవె
వ్యాస మునినీవె వైకుంఠ  వాస నీవె
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll     97

సీ ll
భక్తి భావము నొంది భవరోగ మునుబాయ
        తులసితీర్థము నోట గ్రోల జాలు
గ్రహబాధ లున్నను గాయ కురుపులున్న
         తులసితీర్థము నోట గ్రోల జాలు
భూతపీడిత బాధ భూమిపాటుకు నైన
            తులసితీర్థము నోట గ్రోల జాలు
ఏరోగమున్నను యేబాధ లున్నను
             తులసితీర్థము నోట గ్రోల జాలు
తే ll 
పతిత పావన తీర్థమే పరమ పదము
భక్త జనకోటి కదియంతొ భాగ్య మయము
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll    98

సీ ll
భవ సాగరంబునబడి మునిగిన నన్ను
        కరుణించి మొక్షంబు గలుగ జేయి
దరణిన క్రూరుల దండించు నీకును
         దండ మర్పింతు వే దండ వరద
సీకరంబుగ నీదు సేవ యోనర్చినన్
          కామితార్తము లెల్ల గల్గు మాకు
రక్షకా నవనీత భక్షకా మదుధైత్య
          శిక్షకా యేలనుపేక్ష జేయ
తే ll 
యెంత వేడిన కరుణ రాదింత యైన
పంత మేలర శ్రీరమా కాంత నీకు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll    99

సీ ll
పక్షి వాహన నీ కృపా రసంబున గదా
         సూర్య చంద్రులు కాంతి సూపి రిలకు
పక్షి వాహన నీ కృపా రసంబున గదా
        వాయు దేవుడు వీచె వసుధ గాలి
పక్షి వాహన నీ కృపా రసంబున గదా
         మండుచుండెను యగ్ని మహిని యందు
పక్షి వాహన నీ కృపా రసంబున గదా
         వరునుడు భూమికి వచ్చు చుండె
పక్షి వాహన నీ కృపా రసంబున గదా
        స్థిరముగా భువనంబు దిరుగి చుండె
తే ll 
నీకృ పారసమహిమతో నెల్ల జగతి
నడుచు చున్నాది శ్రీనాథ నంద పుత్ర
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   100

సీ ll
ఇందిరా వల్లభ యింక నైనను నన్ను
      గావకున్నవు నాదు కర్మ మేమి
గోవింద గోవింద గొనగ వేడితి నిన్ను
        పాలింపకున్న నా పాప మేమి
నీలమేఘశ్యామ నిన్నిట్లు బిలువంగ
         పలుకవే నాపాప ఫలిత మేమి
కరుణ జూడవయ నా కర్మ యెట్టి దయిన
        దలపంగ నిన్ను నా ధర్మ మేగ
తే ll 
నిదురలోనైన మానను నిన్ను దలచ
కాన నినువేడ మాన నిక్కంబు గాను
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   101

సీ ll
తోయజాతాక్ష  హే తులసీదళాహార
          నిఖిల  లోకాధార నీల వర్ణ
రత్నమంజుల భూష రమణీయ గుణరూప
          వశుదేవ దేవకీ వరకుమార
రాజసేవిత పాద రక్షిత గుణధామ
         నిజ భక్త వరదేశ నిర్మ లాత్మ
ఖండితాఖిలదుష్ట పండితా పరిరక్ష
          దిక్కునీవె గదయ్య దీన రక్ష
తే ll 
నీ పదాంభుజముల భక్తి నిల్పు కొనుచు
బ్రతుకు సాగింతు యిలనేను భక్త వరద
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll  102

సీ ll
ఓ జగద్రక్షక యో ప్రాణ సంరక్ష 
       యోజగన్మోహన యోముకుంద
యోజగత్కారణ యోభక్త పరిపాల
       యోసద్గుణా నిధె యోదయాబ్దె
యోరమా హృదయేశ యోకోటి రవితేజ
          యోనిత్య కళ్యాణ యోపరేశ
యోపాప పరిహార యోధ్యాన మందిర
         యోసుంద రాకార యోపరాత్మ
తే ll 
అన్య మెరుగని నీనామ మన్చు నేను
కాల గమనంబులో నీదు కరుణ నుంట 
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll.  103

సీ ll
శ్రీరామ జయరామ సిరిమనోహర రామ
         జగమేలు హే ప్రభో జయము జయము
సర్వ వ్యాపక రూప సదమల చారిత్ర
         సజ్జన పరిపాల జయము జయము
నారద సన్నుత నారాయణా విభో 
         సకల వేదంసార జయము జయము
రావణాసుర వధ రణరంగ భీకర
         శస్త్ర హస్త్ర విజయ జయము జయము
తే ll 
సకల గుణధామ శ్రీరామ చంద్ర జయము
సాదు పరిపాల సారంగ సామి జయము
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   104

సీ ll
నీలవర్ణ శరీర నిగమవేద వినుత
         రాక్ష సాంతకుడ నీ రాజ నాలు
దివ్య సుందర గాత్ర దినకర శశినేత్ర
         రఘురామ చంద్ర నీ రాజ నాలు
నిత్య సత్యమ దేవ నిర్మలాత్మక రూప
        రాధికా రమణ నీ రాజ నాలు
సారస పత్రాక్ష సమద దానవ శిక్ష
         రావణ విజయ నీ రాజ నాలు
తే ll 
రమ్య గుణశీల వదన నీ రాజ నాలు
చెప్ప నుండగ జాలును చేరి చెంత
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   105

సీ ll
మంగళం క్షీరాబ్ది మహలక్ష్మి హృదయేశ
        మంగళం దేవేశ మహిత పాల
మంగళం సుచరిత్ర మహనీయ గుణధామ
         మంగళం కమలాక్ష మౌన రూప
మంగళం మణిహార మానస రమణేశ
        మంగళం శ్రీపాద మధుర నాథ
మంగళం శరణార్థ మభయ శ్రీ వరదేవ
          మంగళం శ్రీరామ మారు తీశ
తే ll 
సర్వమంగళ కారుణ్య సవ్య చరణ
సచ్చిదానంద సాకార సగుణ రూప
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   106

సీ ll
శ్రద్ధగా శతకంబు చదివిన వారికిన్
         భవపాప భందముల్ బాయు చివర
శ్రవణంబు చేసిన చక్రిరక్షణ గల్గు
          ఆచరించిన వారికాత్మ దొరుకు
పుస్తకం పూజించ పుణ్యంబు జెప్పన
          వ్యాప్తి చేసిన వచ్చు వసుధ కీర్తి
భక్తి భావంబుతో  పద్యముల్ పాడంగ
           భాగవతుల జేరు బద్రముగను
తే ll 
కామితార్థము లిచ్చెడి కమలనాథు
ఇష్టముగ పాడి మోక్షంబు యిలన బొందు
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   107

సీ ll
కౌండిన్య గోత్రాన కలియుగ మందున
         వెలిగండ్ల వారింట వెలసి తిలన
నాగన్న మనువడై నల్వురు ననుబిల్వ
       నాగరంగాయని నామ నైతి
సద్గుణంబులు బల్కు సహజ నీ నామంబు
        ప్రియముతో నోరార పిలుచు చుంటి
నీదాస జనులకు నిత్యదాసుండనై
         వారి సేవలు జేసి వసుధ నుంట
తే ll 
నరుల నీభక్త గణమందు నాక రైన
చేర్చ జాలును వో దేవ జెల్మి తోన
అవని నాలూరు కోనన యలరు చున్న
రావ నన్గావ దేవ శ్రీ రంగనాథ ll   108

    భగవద్భక్తి యొక్క విశేషాలు

శ్లో ll శ్రీవిష్ణో రర్చనం యేతు
      ప్రకుర్వంతి నరాభువి
తేయాంతి శాశ్వతంవిష్ణో 
      రానందం పరమం పదం ll

తా ll (  నరాభువి ) భూమియందున్న నరులు యవరైతే విష్ణువును కొలుచు చున్నారో అట్టి వారు శాశ్వతమైన విష్ణువు యొక్క పరమానంద  పదమును పొందు చున్నారు.

శ్లో ll సర్వసాధన హీనస్య
     పరాధీనస్య సర్వథా
పాపపీనస్య దీనస్య
       కృష్ణ యేవ గతిర్మమ ll 

తా ll హే కృష్ణా నేను ఏవిధమైన సాధనాలు నీ కొరకై
చేసినవి లేవు ఎప్పుడు పరాదీనమైన  మాయకు వశుడ నై ఉన్న వాడను పాపముల చేత పీడింప బడుచున్న దీనుడను ప్రభో శ్రీకృష్ణా అట్టి నాకు నీవేగతి తండ్రి?

      భగవానుడిట్లు చెప్పుచున్నాడు

శ్లో ll సాధవో హృదయంమహ్యం
      సాధూనాం హృదయంత్వహం
మదన్యత్తే నజానంతి 
       నాహంతేభ్యో మనాగపి ll

తా ll నన్ను పొందుటకు సాధన చేయుచున్న సాధువులు నాకు అత్యంత హృదయ ప్రియులు అలాగే నేను కూడా వారికి ప్రియాతి ప్రియమై ఉన్నాను నేను వారిని తప్ప అన్యమెరుగను వారు నన్ను తప్ప అన్యమెరుగరు.

హనుమత్ దివ్య రక్షా మంత్రం

శ్లో ll
అపమృత్యు భయంనాశం
        ఆంజనేయం అహోబలం
రక్షమాం రక్షమాం దేవం
       రామదూతం నమామ్యహం ll

భావం.అకాల మృత్యు భయములను తొలగ చేయు
వారలు గొప్ప బలమున్న వారు రామునికి దూత అయిన వారు ఆంజనేయ స్వామికి నేను 
నమఃస్కరించు చున్నాను.

       గురువు గొప్పదనము

శ్లో ll చిన్తామణి ర్లోక సుఖం
      సురద్రున్ స్వర్గ సంపదం
ప్రయచ్చతి గుర్ణప్రీతో 
       వైకుంఠం యోగి దుర్లభం ll

తా ll చింతామణి లోకసుఖము మాత్రమే ఇవ్వ గలదు పరసుఖము ఇవ్వ జాలదు సురలోకము నందున్న కల్పవృక్షం స్వర్గ సంపద భోగములు మాత్రమే ఇచ్చును కానీ యోగులకు దుర్లభ మైనట్టి
వైకుంఠ ప్రాప్తిని గురువు శిష్యునికి ఇచ్చు చున్నాడు శిష్యుని యొక్క భక్తి ప్రపత్తులకు ప్రీతి చెంది.

        సంకీర్తన యొక్కగొప్పదనము

శ్లో ll యత్పలంనాస్తి తపసా 
         న యోగేన సమాధినా
     తత్పలంలభతే సమ్య
          క్కలౌ కేశవ కీర్త నాత్ ll

తా ll ఏ తపస్సుల చేత కానీ ఏ యోగముల చేత కానీ సమాధి చేతకాని కలియుగములో లభించుట
కష్టమో అటువంటి పరమ పదము కేవలము సంకీర్తన చేత సులభముగా లభించు చిన్నది.

      భక్తికి మాత్రమే భగవంతుడు అందును

శ్లో ll న తపోభి ర్నవేదైర్చ
         న జ్ఞానే నాపి కర్మణా
హరిర్హి సాధ్యతే భక్త్యా 
           ప్రమాణం తత్ర గోపికా ll

తా ll తపస్సుచేత కానీ వేదా ధ్యాయనము చేత గాని
కర్మ జ్ఞాన మొదలగు దేనిచేత  శ్రీహరి వశుడు కాజాలడు కేవలము భక్తికి మాత్రమే వశుడగును
ఇందుకు ఉదాహరణ ప్రమాణం గోపికలు 
(  ప్రమాణం తత్ర గోపికా )

కలియుగమునకు మించిన యుగము లేదు

శ్లో ll 
నాస్తి నాస్తి మహాభాగ
      కలికాల సమంయుగం
స్మరణా కీర్తనా దేవ
      ప్రాప్నోతి పరమాంగతిం ll 

భావం. 
లేదు లేదు మహాశయా కలికాలంతో సమానమైన యుగము దైవ నామము స్మరణ కీర్తనలు చేసి నంత మాత్రముననే 
కలియుగములోని జనులకు పరమగతి ప్రాప్తించు చున్నది ఇతర యుగములో ఉన్న వారికి ఈ అవకాశము లేదు వారు గొప్ప గొప్ప తపస్సులు
యజ్ఞ యాగములు చేయువలసి ఉండును కావున
వీరు చాలా పుణ్యాత్ములు అని నా అభిప్రాయం.

     భక్తి మాత్రమే ముక్తి నీయగలదు

శ్లో ll అలంవ్రతై రలంతీర్థే
        రలంయోగై రలంమఖై
అలంజ్ఞాన కథాలాపై
        భక్తి రేకైవ ముక్తిదా ll

తా ll ఏ వ్రతములు ఏ తీర్థ యాత్రలు ఏ యోగ           యజ్ఞ జ్ఞాన మున్నగు సాధనలు ఏవి చేయవలసిన పనిలేదు కేవలం భగవంతుని పైన ఉన్న నీ భక్తి  మాత్రమే ముక్తి ఇవ్వగలదు. ( భక్తి రేకైవ ముక్తిదా అన్నాడు )

భక్తుని ప్రేతములు పిచాచములేమి చేయలేవు

శ్లో ll న ప్రేతో న పిచాచో వా
       రాక్షసో వా సురాపి వా
భక్తియుక్త మనస్కానాం
         స్పర్శనే న ప్రభుర్భ వేత్ ll

తా ll ఎవని మనో భావము నందు  భక్తి యనబడు
ప్రభువు ( ప్రభూర్భ వేత్ ) సింహాసనము వేసుకొని యుండునో అట్టి వానిని ప్రేత పిచాచములు రాక్షసులు మున్నగునవి తాకనుకూడ తాక లేవు.

   భక్తుడు లేని దేశం వినాశనము ( హతం )

శ్లో ll అవైష్ణవో హతో దేశో 
       హతంశ్రాద్ధ మపాత్రకం
హతమశ్రో త్రియేదాన
        మనాచారం మతంకులం ll

తా ll వైష్ణవ భక్తుడు లేని దేశము వినాశన మగును
( అవైష్ణవో హతో దేశో ) అపాత్రునకొసంగ బడిన
శ్రాద్ధ భోజనం వినాశ కరమే మరియు శ్రోత్రియుడు కాని వానికివ్వ బడిన దానములు ఆచారము పాటించని కులము వినాశనము పొందును.
( మనాచారం హతం కులం )

            భగవద్ వాచ  ( భాగవతం )

శ్లో ll యథాగ్నిషు సమృద్ధార్ణి 
      కరోత్యే ధాంసి భస్మసాత్ 
తథా మద్విషయా భక్తి
       రుద్ధవై నాంసి కృత్స్నశ్ణ ll

తా ll మండుచున్న అగ్ని పెద్ద పెద్ద కట్టెల రాసినైనా భష్మం చేయగలదు అలాగే నాయందు భక్తి కలవానికి
వాని భక్తియే వాని పాప రాసిని భాష్మము చేయును.

          సాధన విధానము

శ్లో ll యేవం ప్రణవ సంయుక్తం
        ప్రాణమేవ సమభ్యసేత్
దశకృత్వ స్త్రిషవణం
         మాసాదర్వా జ్గ్కితానిల్ణ ll

తా ll ( ఏవం ) ఎప్పుడు ఈ విధమున మూడు సమయములో ( ఉ, మ, సా, ) పదిసార్లు ఓంకార సహితముగా ప్రాణాయామమును సాధన చేయ వలయును అట్లు చేయుట చేత నెల రోజులలో 
( మాసాద్వారా ) ప్రాణ వాయువు వశమగును.
  
దేవతలందరికన్నా విష్ణుమూర్తి గొప్ప దేవుడు

శ్లో ll నారాయణః పరం బ్రహ్మా
        నారాయణః పరం తపః
నారాయణః పరో దేవః
        సర్వం నారాయణః సదా ll

తా ll నారాయణుడే పరబ్రహ్మ నారాయణుడే దేవత లందరి లోను గొప్ప వాడు నారాయణుడే సర్వము అయి ఉన్నాడు.

        సర్వేశ్వర ప్రార్థన

శ్లో ll త్వద్బుద్ధి స్త్వద్గత ప్రాణ
         స్త్వద్భక్తి స్త్వత్పరాయణః
త్వామేహం చ స్మరిష్యామి
          మరణేపర్యుపస్థితి ll

తా ll ఓ సర్వేశ్వరా మృత్యుకాలము వచ్చి నప్పుడు
నా బుద్ధి నీయందే లగ్నమగు గాక నా ప్రాణములు మీయందే లీనమగు గాక మీయందే భక్తి కలిగి యుండు గాక నేను సదా మీ యొక్క శరణ్య మందే
నిలిచి యుందును గాక ఈ ప్రకారము నేను నిరంతరము  మీ స్మరణమే చేయు చుందును గాక.

శ్లో ll అనుధ్యాతోసి దేవేశ
        నమేజన్మ భవేత్ పునః
తస్మాద్బ్రవీమి కర్మాణి
        ఋణం మే న భవేదితి ll

తా ll ఓ ఈశ్వర నాకు తిరిగిజన్మ లేకుండుట కొరకై
నేను మిమ్ములను స్మరించితిని కావున నా యొక్క కర్మనశించు గాక యనియు ఇకనుంచి నాపై దేని యొక్క ఋణ శేషం మిగిలి యుండరాదని మీతో
నేను విన్న వించు కొనుచున్నాను ప్రభో.

      భక్తిని ప్రగాఢ భక్తి విశ్వాసము

శ్లో ll ఉపతిష్ఠంతు మాం సర్వే
        వ్యాదయః పూర్వ సంచితా
అనృణోగన్తు మిచ్చామి
         తద్విష్ణో పరమం పదం ll

తా ll పూర్వ జన్మమున నేనేమి పాపకర్మలను చేసితినో అవి అన్నియు రోగాల రూపమున నా శరీరము నందు ఉండిఉండు గాక  కానీ నేను వాటి నన్నటి నుండి ప్రాణ విముక్తుడ నై విష్ణుమూర్తిని పొంద దలచి నాను.

         పాట
పల్లవి 
రంగ రంగ రంగా రంగనాయకా
                   శ్రీ రంగనాయక
ఆలూరు రంగ ఆనంద రంగా
రంగ రంగ రంగ రంగనాయకా
                   శ్రీ రంగనాయక

చరణం
కొండలోయలో నున్న కోనరంగనాయక
శయణించి యున్నావ శేషపానుపు పైన
దేవేరుల సేవితుడ దేవగణా పూజిత
సకల జగన్నాయకా స్వామి రంగనాథ l l

చరణం 
జల జల నీటి వొడ్డున దేవవృక్షాల నడుమ
ఆహ్లాద  కోనలో  అలరారు చున్నావ
పంచాయు దాధర ప్రహ్లాద వరదుడా
పాంచాలి రక్షకా పడుకొని యున్నావా l l

చరణం  
భక్త జనా బాంధవ భవబంద మొచన
సకలలోక పాలక సాగర కన్యా విభో
శంఖ చక్రాధర చేరదీయ మము రావ
శరణా గత రక్షకా శరణు శరణు దేవ ll 

యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

 ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః     















 





        










        



 
         
        

 












          







         

        






Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం