శివ మానస పూజ శ్రీ శంకరాచార్య కృతం.
శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివ మానసపూజ
స్తోత్రమ్.........
అందులో
మహాద్భుత స్తోత్రం శ్రీశివమానస పూజ స్తోత్రం.....
శ్రీ శివ మానస స్తోత్రం.....
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం
నానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్
జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ !! 1 !!
ఓ పశుపతీ!, నీకు నేను పూజ మనసుతో ఇలా చేస్తున్నాను స్వామి! నీవు కూర్చోవడానికి రత్నఖచితమైన ఆసనము సమర్పిస్తున్నాను. గంగాజలములతో అభిషేకము చేస్తున్నాను. నానారత్నాభరణములచే అలంకరింపబడిన
దివ్యమైన వస్త్రము నీకు సమర్పిస్తున్నాను.
కస్తూరీ మిశ్రితమైన గంధమును అలదుతున్నాను. మల్లెలు,చంపకములు,మారేడుదళాలు,ధూపము, దీపమూ నీకు సమర్పిస్తున్నాను.
ఈ ఉపచారములన్నీ, దేవా,నాహృదయములో కల్పిస్తున్నాను. ఓ దయానిధీ, స్వీకరించు.
సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పఞ్చవిధం పయోదధియుతం రమ్భాఫలం పానకమ్ ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం
తామ్బూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు 2
శంభో! నవరత్నఖచితమైన స్వర్ణపాత్రయందు పాయసము, నెయ్యి, పంచ భక్ష్యాలు, పాలు, పెరుగు, అరటిపండు, పానకము,
శాకములతో అర్పిస్తున్నాను. శుద్ధ జలమూ, రుచికరమూ, కర్పూరముతో.కూడినదీ అయిన తాంబూలమూ సమర్పిస్తున్నాను.
నీకు ఈ భోజనం.ప్రభూ,నాహృదయంలో కల్పిస్తున్నాను, స్వీకరించు స్వామి!
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలమ్
వీణాభేరిమృదఙ్గ కాహలకలా గీతం చ నృత్యం తథా ।
సాష్టాఙ్గం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సఙ్కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో 3
ఓ శివా! ఇక నీ భోజనానంతర ఉపచారాలు చూడవయ్యా!. నీకు ఛత్రం పడుతున్నాను,
రెండు చామరాలతో వీస్తున్నాను.
విసనకఱ్ఱతో గాలిని వీస్తున్నాను,
నిర్మలమైన అద్దమూ సమర్పిస్తున్నాను.
వీణ, భేరి, మృదంగ వాయిద్యాల కోలాహలంతో, గానమూ, నృత్యమూ సమర్పిస్తున్నాను.
నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.
నిన్ను బహువిధాలుగా స్తుతిస్తున్నాను.
ఈ సమస్తమూ , ఓ ప్రభో! నీకు నా హృదయములో చేసే ఈ పూజను స్వీకరించు తండ్రి!
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః ।
సఞ్చారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో తవారాధనమ్4
ఓ శంభో! నీవే నా ఆత్మవు.
అమ్మవారు నా బుద్ధి.
నా ప్రాణాలు నీ సహచరులు.
నా శరీరము నీ ఇల్లు.
నా ఇంద్రియభోగములు నీ పూజా వస్తువులు.
నా నిద్ర నీ సమాధిస్థితి.
నా నడక నీకు ప్రదక్షిణము.
నా మాటలన్నీ నీ స్తోత్రాలు.
ఓ శివా, నేను ఏ ఏ పనులు చేస్తున్నానో,
అవి అన్నియూ నీ ఆరాధనలే స్వామి!
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్
విహితమవిహితం వా* *సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశమ్భో ॥ 5॥
శ్రీ మహాదేవా! శంభో! కరుణా సముద్రా!
నేను కరచరణాదులతోనూ, శరీరంతోనూ,
మాటలతోనూ, నా చేతలతోనూ, చెవులతోనూ, కళ్ళతోనూ, మనస్సుతోనూ చేసిన అపరాధములు,
అవి చెయ్యదగినవైనా చెయ్యకూడనివైనా సరే, వాటన్నింటినీ క్షమించు. జయ జయ శంకర.🙏
ప్రతిరోజు చదువుకుందాము.
ఈశ్వరుడివైపుకి ఒక్కొక్క అడుగు వేద్దాం,
అందునా బాహ్యపూజకంటే అంతరమున చేసే పూజకే త్వరగా పలుకుతాడు శంకరుడు.
Comments
Post a Comment