శ్రీ గిరి భ్రమరాంబ అష్టకం
రవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి
ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి >
శివుని పట్టపురాణి గుణమణి శ్రీ గిరి భ్రమరాంబికా || 1
కలియుగంబున మానవులకు కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్త వరులకు అష్ట సంపద లీయవా
జిలుగుకుంకుమ కాంతిరేకుల శ్రీగిరి భ్రమరాంబిక || 2
అంగవంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాలకొంకణ భూముల యందునన్
రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్
శృంఖలా దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ||3
అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివి
శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక ||4
ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణి
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి
శీఘ్రమేవని వరము లిత్తువు శ్రీ గిరి భ్రమరాంబికా||5
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||6
సోమశేఖర పల్లవారధి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నామనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || 7
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివి
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా || 8
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || 9
తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబిక || 10
Comments
Post a Comment