ఏకాక్షర శ్లోకాలు
శ్రీ ఏల్చూరి మురుళీధర రావు గారి పూరణ
[1]
డండడ డేడిడ డైడా
డండా డోడౌడ డాడడాడా డాడై
డండూడిడౌడడడడా
డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!
ప్రతిపదార్ధాలు –
డం = డమరుకము యొక్క,
డ = శివంకరమైన నాదమునందు;
డ = ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా!
డే = దాంపత్యధర్మమును అనుసరించి,
డి = గౌరీదేవిని,
డ = మేని సగభాగమున తాల్చిన దేవా!
డై = వృషభము,
డా = విజయ ధ్వజముగా కలవాఁడా!
డం = తృతీయనేత్రమందు,
డా = అగ్నిని తాల్చిన విభో!
డో = దుష్టుల,
డౌ = సంహారమునందు,
డ = రక్తివహించిన ప్రభూ!
డా = శ్రీదేవిని,
డ = వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే,
డా = జయ విజయోక్తులతో,
డా = సన్నుతింపబడిన దేవా!
డా = వెన్నెల వంటి,
డై = నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి,
డం = పాల వంటి,
డూ = ఆదిశేషుని వంటి,
డి = గౌరీదేవి వంటి,
డౌ = కామధేనువు వంటి,
డ = శంఖము వంటి,
డ = చంద్రుని వంటి,
డ = అమృతము వంటి,
డా=తెల్లని దరహాసము గల వాడా!
డం = గాయనుల యొక్క,
డ = స్తోత్రములచే,
డ = ప్రసన్నుఁడ వగు,వాడా
డ = సర్వేశ్వరుఁడవైన,
డ = పరమేశ్వరా!
డం = దుర్మతులకు,
డ = త్రాసమును కలిగించు వాడా!
డం = డమరువు యొక్క,
డ = భీషణమైన ధ్వని కలవాఁడా!
డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాద నివేదనం చేస్తున్నాను.
విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.
౨) ఏక వ్యంజన శ్లోకం/పద్యం
[2]
దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః |
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః ||
దాదదః =శ్రీ కృష్ణుడు,
దుద్దరుత=వరముల నన్నిటిని,
దాదీ=ఇచ్చువాడు,
దాదదః=పాపములను దహించు వాడు,
దదోః=దుష్టులను,
దూదదీ = శిక్షించువాడు
దుద్దాదం = మం చి వారిని,
దుద్దే = కాపాడుట యందు,
దదదే = దీక్ష గలవాడు
దదోదదః = ధర్మాధర్మములను,
దాదా = మిక్కిలిగా,
ద ద = ధరించువాడు అనగా ధర్మమును,
కాపాడి ధర్మమును శిక్ష్కించు వాడు
అని అర్థం.
భావం: శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.
౩) శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి
ఒక శ్లోకం
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా ||
పద విభాగం :
యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా.
భావం:
భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం.
౪) శ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి…
శ్లో ||
రరోరరే రరరురో
రురూరూరు రురోరరే |
రేరే రేరారారరరే
రారేరారి రిరారిరా ||
పదవిభాగం –
ర, రోః, అరేః, అర, రురోః, ఉః, ఊరూరుః, ఉరః, అరరే, ర, ఈరే, రీరారా, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
అన్వయం –
ర, రోః, అర, రురోః, అరేః, ర, ఈరే, ఉరః, అరరే, రీరారా, ఊరు + ఊరుః, ఉః, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
ప్రతిపదార్థాలు –
ర = రామశబ్దంలోని రేఫ (రకారం) వలన
రోః = భయం కలవాడైన,
అర = వేగంగా పరుగెత్తే
రురోః = హరిణరూపంలో ఉన్న మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని యొక్క
ర = కౌస్తుభమణిని
ఈరే = పొంది ఉన్న
అరః + అరరే = కవాటంవంటి వక్షస్థలంలో
రీరారా = లీల నాపాదించే (రలయో రభేదః)
ఊరు + ఊరుః = తొడలచే గొప్పదైన
ఉః = సీత భూమిక దాల్చిన లక్ష్మిని
అరరర = తన నిలయానికి తీసికొని వెళ్ళిన
ఇరార = సముద్రద్వీపాన్ని (లంకను) పొంది ఉన్న
ఇరారి = భూమికి విరోధి అయిన రావణునకు
రిః = నాశనాన్ని కల్గించిన దగుచు
ఆరి = చెలికత్తెలను
రా = పొందింది.
శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం.
౫) అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ప్రతిపదార్థం :
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
భావం:
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం.
ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.
Comments
Post a Comment