శతకం 2

ఓం
సీ ll 1
శ్రీరుక్మిణీ నాథ శిక్ష తాసుర దేవ
           కటిదృత హస్త లోక ప్రశస్త
రత్న మంజులభూష రమణీయ తరకాంత
          భవ్య కౌస్తుభవక్ష పంక జాక్ష
రాజ సేవిత పాద రక్షిత ప్రహ్లాద
          కాలాభ్ర సమదేహ గరుడవాహ 
కనక మంజుల చేల కరిరాజ పరిపాల
       నీదాస జనహృద్య నిగమ వేద్య
తే ll ఘణకృపాపాంగ కుజనాళి గర్వ భంగ
భరిత మృగ మదతిలక సత్పాల ఫలక
మహిత వైకుంఠ పురవాస మంజు హాస
రావె నన్గావ దేవ శ్రీ రంగనాథ ll 

సీ ll 2
పాలాక్ష కమలసంభవ సురేంద్రస్తుత్య 
        ఘోరాజి నిన్జిత  క్రూర ధైత్య
ధృతరత్న పథకోల్లసిత మహో రస్థల
         పాలిత నిఖిల గోపాల బాల
సాళ్వాదిరిపుఘోర సర్పబృంద సుపణన్
         నిఖిల లోకాధార నీల వర్ణ 
శ్రీకరనవ తులసీదళాంచిత హార
       వసుదేవ దేవకీ వరకుమార
తే ll మౌని జనపోష మృదుతర మంజు భాష
కలుష సంహార మత్తారి ఘనసమీరా   

సీ ll 3
ఇందిరావర సదానంద  నందకుమార
         మారసుందర నిర్జి తారివీర
వీరదానవ భట ధారుణీ ధరశక్ర
         శక్రాది సురనుత చరణ పద్మ
పద్మజ జనక తాపస లోక పరిపాల
          ఫాలాక్ష సన్నుత భాసు రాంగ
అంగనాజన మనోహర దాస పూజిత
         జితమహాం హోబృంద శ్రీ ముకుంద
తే ll కుంద సన్నిభ రదన రా కేందు వదన
ధనద సుతయుగ్మ ఘణశాపదళన నిపుణ. 

సీ ll 4
శ్రీధరావినత గంగాధరా దృతదారు
         ణీధరా మాన్పు నా బాధ లెల్ల
బ్రోచెదో లేక నన్నేచదో విడనాడ 
         జూచెదో నాకేమి తోచ దాయె
రక్షకా నవనీత భక్షకా మదదైత్య
          శిక్షకా యేలను పేక్ష చేయ
మానారా చలము నీ వానిరా నీ భక్తి
         మానరా నేనింక మదన జనక
తే ll భవ్య చారిత్ర సుచరిత్ర పద్మ నేత్ర
వదన జితసోమ కంసాది వైరి భీమ

సీ ll 5
వారిజ దళనేత్ర వైకుంఠ పురవాస
        వాసవార్చిత పాద వనజ యుగళ
గళదృత నవరత్న కలితహార వ్రజ
         వ్రజసుందరీ మనోంబుజది నేశ
ఈశపురో గాఖిలాశాధి పావన 
           పావన జీవ నాస్పద పదయుగ
యుగవిగ మోపాత్త యోగనిద్రా ముద్ర
          ముద్రితాఖిలజన మోహ నికర
తే ll కరదృతద రారి సాధనోత్కర నికృత్త
నిఖిల లోకైక కంటక నికర శీర్ష 

సీ ll 6
చాలురా యీచలం బేలరా నీభక్త 
         వరునిరా మానస వనవిహార
కోపమా నేజేయు  పాపమా పరితాప
         మాపుమా నీకృప చూపుమింక
నేరమా యినజేర దూరమా ననుబ్రోవ
          భారమా మార శృంగార నీకు
కష్టమా ననుబ్రోవ నష్టమా నాదుర
          దృష్టమా దెల్పు విస్పష్ట ముగను
తే ll పంత మేలర శ్రీరమా కాంత నీకు
నెంత వేడిన గరున రాదింత యైన

సీ ll 7
శ్రీకరా శత్రు హృద్భీకరా దివ్యప్ర --
         భాకరా సన్ముక్తి నాకొసంగు
దూషణాదిక దైత్య శోషణా నవరత్న
         భూషణా వేగనా దోష ముడుపు
సుందరా వైకుంఠ మందిరా వరకంబు
         కంధరా నీవు నా యంద యుండు
పాలకా మంజు నీలాలకా గోపాల
         బాలకా నేడునీ జాలి జూపు 
తే ll అన్య మెరుగను నీదు పాదాంబుజములె
శరణ మనినమ్మి వేడెద బరమపురుష

సీ ll 8
అరయ నావాఖ్యంబు లపశబ్దములె యైన
              పరమ నికృష్ట నే పాపి నైతి
రమణ ఛందోలక్షణము లెరుంగకు యున్న
              దగినపెద్దలు చూచి తప్పు లన్న
నతిశుంఠలగు వారు హాస్యంబొనర్చిన
              నలరేగి శఠులెల్ల  నవ్వు చున్న
ధ్వని గుణరీతి పాక నిరూఢి లేకున్న
              గడగ దోషము లేన్ని కల్గి యున్న
తే ll సర్వ రక్షక నీదు సంస్మరణ గాన
దలప నిదియెందు గడు బవిత్రంబు గాదె

సీ ll 9
దేవకీ వరపుత్ర త్రిభువనస్తుతి పాత్ర
          జలజ సన్నిభ నేత్ర శరణు శరణు
గోవర్ధ నోద్ధార గోపాంగ నాజార
           చానూర మర్ధన శరణు శరణు
రాజితాంబుద వర్ణ రత్నకుండల కర్ణ
           వరకృపా పరిపూర్ణ శరణు శరణు
హృతపూతనాప్రాణ వితత దివ్యకృపాణ
            శరణాగతత్రాన శరణు శరణు 
తే ll శరణు సొచ్చిన కడుదీన జనుల గావ
నరయ నీకంటె దైవమీ యవని గలడె

సీ ll 10
నీమాయ గణలేక నీలకంధరుడు నిన్
          భామగా దలపోసి పరుగు లెత్తె
నీమాయ గనలేక  నీరజ గర్భుండు
          తవిలినిన్మదినిల్పి తపమొనర్చె
నీమాయ గనలేక నిర్జర నాథుండు
         శిలలను గురియించి సిగ్గు నొందె
నీమాయ గనలేక నిఖిల ప్రపంచంబు
         భ్రమసి సంసార బంధమున జిక్కె
తే ll నిట్టి నీమాయ దెలియగా నెవరి కైన
దరమె భావించిచూడ నీధరణి యందు

సీ ll 11
చతురాత్ము లైన పండిత ముఖ్యులకె గాక
          కామినీజను లేడ కవన మేడ
ధృతిశీలులగు భాగవత జనులకె గాక
          కామినీజను లేడ కవన మేడ
వివిధ శాస్త్రపురాణ వేత్తల కేగాక
            కామినీజను లేడ కవన మేడ
వితతనవో న్మేశ మతి మంతుల కె గాక
            కామినీజను లేడ కవన మేడ
తే ll వన్న నముసేయుటకు నాకు వశముగాదు
భావమున దోచినంతనిన్ బ్రస్తుతింతు

సీ ll 12
మత్త కంసద్విపమారణ పంచాస్య
      కాళియ గర్వాంధ కార సూర
దప్పింత పౌండ్రక సర్పాది పసుపణన్
        సాళ్వరాజాబ్జాత సామ జేంద్ర
ఘోరతృణావర్త గోత్రామరేశ్వర
       చైద్య ఘనాఘన చండ పవన
దంతవత్క్రా రణ్య  దావానలజ్వాల
        బగదైత్య పాదప పటుకు ఠార
తే ll పావన మనోజ్ఞ దేవకీ దేవి జఠర
క్షీర సాగర సంపూర్ణ శీతకిరణ

సీ ll 13
తగననాథనుననాథా రక్షకుడ వీవు
          రక్షింపవే నన్ను రాక్ష సారి
దీనజనుడ నేను దీనావనుడ వీవు
         దీనత్వ ముడుప వే దేవ దేవ
భక్తిసల్పెద నేను భక్త పాలుడ వీవు
        ముక్తి నొందింప వే మోహనాంగ
అన్యమెరుంగ నిన్నాశ్రయించితి గాన
          బాలింప వే వేగ నీల వర్ణ
తే ll క్షీర సాగర శయన లక్ష్మీ కళత్ర
సుజన మందార ననుదయ సూడవయ్య

సీ ll 14
బ్రోవరాయిక శ్రీరమావరాకలుశాబ్ధి
         నావరా నీపాద సేవ నాకు
దొరగదా యనివేడ కరుగదా చిత్తంబు
         వరగదా ధరనిన్ను మరువ నింక
పంతమా వేగనాచింత మాన్పవ దేమి
          యింతమాయలి కేల కంతు జనక
నెట్ట నన్గరుణ చేపట్టి నన్గసరించి 
         తిట్టినన్ విడువనిం కెట్టు లైన
తే ll దాన వాంతక నావంటి దీన జనుని
నరసిరక్షింప నన్యులకలవి యగునె

సీ ll 15
క్షీరాబ్ధి పుత్రి భాసిలు సంతసంబుచే
          బంకజంబుల మించు పదము లొత్త
నబ్జజ శతమఖులాదిగా వేల్పులు
        భయభక్తు లలరంగ బ్రస్తు తింప
గంధర్వవర యక్ష  గరుడకిన్నెర ముఖుల్
         గైవారములు భక్తి గలిగి సేయ
నారద సనక సనందన ప్రముఖులు
            నానా గతుల వందనములు సేయ
తే ll నాది ఫణియందు శయనించినట్టి నిన్ను
బూని యెల్లపుడును మనంబున దలంతు

సీ ll 16
వదననిర్జిత సోమ వైరిగర్వవిరామ
        భువన పావన నామ బ్రోవు మయ్య
సత్యభామాలోల సజ్జన నుతశీల 
          భూపాల గోపాల బ్రోవు మయ్య
భుజగకంకణ మిత్ర భూరినీరద గాత్ర
          పుణ్యచారిత్ర నన్ బ్రోవు మయ్య
కాళీయ మధశోష కపటమానవ వేష
          భూసుర పరితోష బ్రోవు మయ్య
తే ll భోగజిత నిర్జ రాధీశ బ్రోవు మయ్య
భోగి వరశాయి సర్వేశ బ్రోవు మయ్య

సీ ll 17
కేశవ నారాయణా శచీపతినుత
        మాధవ గోవింద మౌనివంధ్య
శ్రీవిష్ణు మధుసూదనా విరించిస్తుత
         శ్రీమత్త్రివిక్రమ వామ నాంక
శ్రీధర దేవ హృషీ కేశ వరపద్మ
       నాభ దామోదర భూభయహర
శ్రీశ సంకర్షణ శ్రీ వాసు దేవాఖ్య
        ప్రద్యుమ్న యనిరుద్ధ భవభయహర
తే ll పూరుషోత్తమాధోక్షజ నారసింహ
యచ్యుత జనార్దన యుపేంద్ర హరిమురారి

సీ ll 18
హరిభక్తు లెల్ల మాకాత్మ బాంధవు లైరి
         దుర్మదాంధులు కడు దూర మైరి
కమలాక్షు కథలు కర్ణముల కింపుఘటించె
           నితరులకథ లసహ్యత ఘటించె
మనసిజ గురుడన్న మది సంతసము నొందె
            వేరన్న చిత్తంబు  వేట్కడిందె
శ్రీశునిగొనియాడ జిహ్వకు రిచియయ్యె 
             పరులవర్ణన విషప్రాయ మయ్యె
తే ll ఎట్లు చూజూచినాదైవ మీవె గాన
మానసంబున నీకృప మాన వలదు

సీ ll 19
నినునమ్మి యుంటినే నీవాడి నంటినే
         పలుకరా పలుకారా పద్మ నాభ
వినుతింపు చుంటినే విడనాడ నంటినే
        కావరా కావరా ఖగతురంగ
తడవేల నంటినే దయజూడ మంటినే
         చూడరా చూడరా సుర శరణ్య
అభయ మిమ్మంటినే యలుకేల నంటినే
        మానారా మానరా మౌని వంద్య
తే ll నీవె శరణంబు నాకింక నిక్కముగను
బ్రోవు బ్రోవుము మ్రొక్కెద దేవ దేవ

సీ ll 20
వనధి కన్యా చిత్త వనజాత వనజాప్త
         వనజాప్త తేజ పావన చరిత్ర
వనచరిత్రాణ సద్భక్త బృందావన 
          బృందావన విహార సుంద రాంగ
సుందరాంగద మిత్ర విందామనోహర
          హర విధి ప్రముఖ దేవార్చితపద
పదనమద్భక్త సంపాదిత నిఖిలాథ
          నిఖిలాథ బోధన నిపుణ దిషణ
తే ll ధిషణ ముఖవిబుధ స్తుత దివ్య మహిమ
హిమగి రీంద్ర స్తుతా మనః కమల వాస

సీ ll 21
ఖండితాఖిల దోష పండిత పరితోష
          వివిధ రత్నవి భూష విఠ్ఠ లేశ
సదమల చారిత్ర సజ్జన నుతిపాత్ర 
           విమలాబ్జ దళనేత్ర విఠ్ఠ లేశ
కరుణానివేశ బీకరదైత్య గణనాశ
           విదళిత భవనాశ విఠ్ఠ లేశ
శ్రీకరాకార యాశ్రిత పాప పరిహార
            వీరావతార శ్రీ విఠ్ఠ లేశ
తే ll  విహగ వల్లభ వాహన విఠ్ఠ లేశ
వివిధ భువనైక మోహన విఠ్ఠ లేశ

సీ ll 22
గోపాల కృష్ణ శ్రీ గోవింద యందునో
         బలసహోదర యంచు బలిక వలెనొ
దేవకీసుత వాసు దేవ యటందునో
         పీతాంబరాయంచు బిల్వ వలెనొ
నరమిత్ర రుక్మిణీ  నాథ యటందునో
     యచ్యుత కమలాక్ష యనవలయునొ
అటుగాక సత్య భామాధిప యందునో
        దానవాంతక యంచు దలతు నొక్కొ
తే ll తెలుపవే నాకు దయతోడ దేటపడగ
కంస మర్ధన యో ద్వారకా నివాస

సీ ll 23
అదికుడ వీవని యలరుచు మ్రొక్కితి
        గోపంబు నొందకు పాప రహిత
దయగల్గ వలెనని దండంబు బెట్టితి
          గోపంబు నొందకు కోమ లాంగ
నాతండ్రిగా నిన్నే నతులాచరించితి
           గోపంబు నొందకు కుధర భరణ
భయభక్తు లేపార బ్రణుతి యొనర్చితి
           గోపంబు నొందకు కుజన హరణ
తే ll అన్యులను వేడ నాదుచిత్తాబ్జ మందు
నమ్ము నామాట నేను నీ సొమ్ము సుమ్ము

సీ ll 24
కమలారి ధరమిత్ర కారుణ్య రసపాత్ర
        కమలాకళత్ర నన్గరుణ జూడు
కుంతలజితబృంగ క్రూరదానవభంగ
        ఖగరాట్తు రంగ నన్గరుణ జూడు
బాలేందు సమఫాల భాసుర సుకపోల
         కరిరాజ పాల నన్గరుణ జూడు
మునిమానస విహార మురదైత్య సంహార
         కనకాద్రి  ధీర నన్గరుణ జూడు
తే ll ఖండితాఖిల రిపుబృంద కరుణ జూడు
కలుష సంహార గోవింద కమలనాభ

సీ ll 25
అధిక క్షుదదార్తులకు నీవు యన్నంబిడిన జాలు
          సంతర్పణంబులు సలిపి నట్లె
తనదు నేరంబులు తాదెలిసిన జాలు
           పరులకు బుద్ధులన్ గరపి నట్లె
శిష్ట జనాళికి సేవ చేసిన జాలు
           వెలయు తీర్థముల సేవించి నట్లె
మునుకొని దుర్గుణంబులు మానినను జాలు
           ఘనసద్గుణము లెల్ల గల్గి నట్లె
తే ll పొందుగా మానసము నిన్ను పొంది యున్న
కోటి దైవములను జేరి గొలచి నట్లె

సీ ll 26
మోక్ష మిచ్చెదవని మ్రొక్కితే నామీద 
          పంతమేలర నీకు పాండు రంగ
నాస్వామి నీవని నమ్మి నుతించితే
           పంతమేలర నీకు పాండు రంగ 
దేవ దేవుడవని సేవలొనర్చితే
            పంతమేలర నీకు పాండు రంగ 
బ్రోచెద వనినీదు పూజ గావించితే
            పంతమేలర నీకు పాండు రంగ 
తే ll పరగ దీనుల బ్రోచెడి బిరుదు గల్గి
పంతమేలర నీకునో పాండు రంగ

సీ ll 27
అనుదినమును నిన్ను వినుతిసేయుట జాలు
         తలపోయగా ఘోర తపము లేల
ఆశతో నీకథ లాలకించుట జాలు
           వేయుపురాణము ల్వినగ లేల 
పట్టిజీవుల హింస బెట్టకున్డుట జాలు
            గట్టిగా సత్రము ల్గట్ట నేల
పరధనం బింతైన బట్టకుండుటె జాలు
          బరుల కిచ్చెద నని బలక నేల
తే ll దేవ దేవుడ వీవను దెలియ జాలు
దేవతల జూడ దేశముల్దిరుగ నేల

సీ ll 28
నీపద స్మరణముల్ నెరిదుఃఖ హరణము
       ల్గలుషాబ్ది తరణము ల్కమల నాభ
నీమీద గలభక్తి నిజము మేలగుముక్తి
          ఘనమైన సన్ముక్తి కామ జనక
నీదు చారిత్రము ల్నిర్జర స్తోత్రముల్
          పులకిత గాత్రముల్పురుష వర్య
నినుగూర్చి పాటలు వినుటకు నీటులు
        సుకృతంపు మూటలు శుభ చరిత్ర
తే ll నిన్ను బాయగ లేనయో నిమిష మైన
నన్ను దరిజేర్చి రక్షించు  కన్న తండ్రి

సీ ll 29
నీటైన రత్న కిరీటంబు మెరయంగ
         లలితంపు మణికుండ లంబులూగ
తీరైన కస్తూరి తిలకంబు జారంగ
         కరమున శంఖచక్రమము లమర
ఘనమగు కౌస్తుభ మణిప్రకాశింపగ 
         రమణీయ హేమాంబ రముచెలంగ
వనరాశి కన్యక వక్షస్థ లినివెల్గ
        గజ్జలు పదముల ఘల్లు మనగ
తే ll మించి చనుదెంచి నామొరాలించి నాదు
చిత్త జలజమునను నివ సింపు మయ్య

సీ ll 30
శ్రీ పాండురంగ నీ సేవయొనర్చిన
          దాపంబు పాపంబు దగ్ధ మౌను
శ్రీ పాండురంగ నీ సేవయొనర్చిన
          జ్ఞానంబనూనమై ఘనత కెక్కు
శ్రీ పాండురంగ నీ సేవయొనర్చిన
        భక్తి యుక్తులు మది బ్రభవ మందు
శ్రీ పాండురంగ నీ సేవయొనర్చిన
        దోషముల్ రోగముల్ దొలగు చుండె
తే ll దేవ దేవేశ నీపాద సేవ వలన
మోద మలరంగ గడపట మోక్ష మబ్బు

సీ ll 31
మత్స్యావతారనా మనవిగై గొనవేమి
         కమఠావ తార నన్గావ వేమి
వారాహరూప నా వగపుమాన్పవ దేమి
           నరసింహ బ్రోవకున్నావ దేమి
వటురూప నాదు లంపటమానుపవ దేమి
         భార్గవ రామ కోపంబ దేమి
శ్రీరామ చంద్రనా చింతమాన్పవ దేమి
           బలరామ బిలచిన బలుక వేమి
తే ll శ్రీ మహా బుద్ధ రూప రక్షింప వేమి
కల్కిరూప నీదగు కృప జిల్క వేమి 

సీ ll 32
బృంగంబువలె పేడ పుర్గులేగతి గ్రోలు
          రాజీవతతి మకరంద ములను
జుంటీగలను బోలె జోరీగ లెటుగూర్చు
         మానుగా మధురంపు తేనె గడ్డ
హంసతీరున బకం బరసి యే గతి ద్రావు
           నంబువుల్విడచి మే లైన పాలు
శుకముల కైవడి సొంపుగా నెటుబల్కు
        వాయసంబులు మంచి వాక్యములను
తే ll జలజ దళనేత్ర నీభక్త జనుల భంగి
పాతకుల కెట్లు గల్గునీ పాద భక్తి

సీ ll 33
అక్రూరవిజయ రుక్మాంగదాదుల నెల్ల
        గరుణజూచిన మహా ఘనుడ వీవు
వ్యాసవాల్మీకి దూర్వాసోముఖుల కె ల్ల
        ముక్తి మార్గంబిచ్చు మూల మీవు
నందుని సతికిమన్నన తోడ నోటన 
        జగములన్ జూపిన జాణ వీవు
రాణించు వ్రేపల్లె రమణుల చిత్తంబు
           లపహ రించిన యట్టి హరివి నీవు
తే ll యాలమున మగ ధాధిపుడాది నృపుల
బింకములడంచి వెలుగొందు బిరుదు వీవు

సీ ll 34
జగముల నినుబోలు జాణలేడని గదా
        యిబ్బంగి నిన్నాశ్రయించు టెల్ల 
వెదకిన నీవంటి వేల్పులేడని గదా
          వచ్చి నీమరుగిట్లు జొచ్చు టెల్ల
నినుబోల్దయా శాలి నెందుగానక గదా
           వేట్కతో నభయంబు వేడు టెల్ల
నీ చరిత్రంబెల్ల నిక్కు వంబనికదా
        నన్ను గాచెదవని నమ్ము టెల్ల
తే ll కన్న తండ్రివౌ నీమది గరగ కున్న
పరులకిక నెట్లు దయగల్గు పరమ పురుష

సీ ll 35
ఉపవాసములు సేయనోపలే నిసుమంత      
         దానంబు సేయ నా తరము గాదు
పుణ్య స్థలములకు బోవ నాచేగాదు
          ఘనమైన నదులలో మునుగ లేను
మంత్ర జపంబులు మరినాకు కొరగావు
          వ్రతనిష్ట సలుప నా వలన కాదు
మేరదప్పక సదా చారంబు నెరుగను
           చిత్తంబు నీపైన జేర్చ లేను
తే ll ఇట్టి పాపాత్ము డనియు నన్నే విధమున
కరుణ చూచెద వో గాని కంజ నేత్ర

సీ ll 36
వనజాక్ష నీకు వందనము చేసిన తలల్
           సేయనేరక నున్న జెడ్డ శిలలు
గోపాల కృష్ణుని న్గొనియాడు నవినోళ్ళు
          కొనియాడ కున్నవి గోడ గూళ్ళు
శ్రీనాథ నిన్ను వీక్షించిన నక్షులు
       వీక్షింప కున్న గవాక్షులరయ
ఘనముగా నీకథల్ వినుచున్న యవిచెవుల్
         కూర్మితో వినకున్న కొండ గవులు
తే ll అరయగా నిను చెందినది మనంబు
చెంద కుండిన యదిముండ్ల చెడువనంబు

సీ ll 37
కృష్ణ కృష్ణాయని కోకలు వడయంగ
           గృష్ణ కృష్ణా యేను కృష్ణ గాను
రామ రామాయని రహిముక్తి నొందంగ
          రాయ కావ్యము నాటి బోయ గాను
హరిహరియని వేడి యరినడగింపంగ
            హరిహరియే నల కరిని గాను
గోవింద యనినిన్ను సేవించి బ్రతుకంగ
        గోవింద నే కుంతి కొడుకు గాను
తే ll యెలమి నినుగొల్చు వారిలో యెవరు
నెటుల ననుదయ జూచెదో యీశ్వ రేశ

సీ ll 38
మాధవ కథలు సమ్మతితోడ వినువారు
       హరిమందిరంబున కరుగు వారు
పక్షిరాడ్గమనుని పదభక్తి గలవారు
          తోయ జాక్షునిపూజి సేయు వారు
గోవిందు నెప్పుడు గొల్చుచుండెడి వారు
            దేవ దేవుని కథల్ దెల్పు వారు
పురుషోత్తమయటంచు స్మరణ చేసెడి వారు
            మురవైరి వీక్షించి మ్రొక్కు వారు
తే ll పరమ పుణ్యులు సజ్జనుల్ భవ్య మతులు
వారి పాదంబులకు జేతు వందనములు

సీ ll 39
పరుల సొమ్మునకాశ పడియెడి వారలు
          పరసుందరుల గాంచి బ్రమయు వారు
పరనింద రోయక పలుమారు వినువారు
           పరులనెప్పుడు దూర బలుకు వారు
పరులదండనకయి బహుచింత పడువారు
            పరులనేరము రోసి పట్టు వారు
పరధర్మములకు సొంపలర మెచ్చని వారు
           పరులెరుంగక భువి బ్రతుకు వారు
తే ll దురిత కర్ములు దుర్జనుల్ దుష్ట మతులు
గాన వారల కిహపర గతులు గలవ

సీ ll 40
మిక్కిలి కలకండ నొక్కుట విడనాడి
        తీపని వేపాకు తినినరీతి
మేలైన నావుల పాలను విడనాడి
          యుప్పునీళ్లను ద్రావు చొప్పు గాక
చెన్నుమీరిన మంచి చెరకును బ్రోదోచి
           నయమని యొకకోల నమలురీతి
బాగైన ఖర్జూర ఫలమును వర్జించి
            కోరిముష్టి ఫలంబు గుడుచురీతి
తే ll పావనం బైన నీపాద భజన వీడి
మొనసి పరదైవతములకు మ్రొక్కు టేల

సీ ll 41
సభమెచ్చె ననిచాల సంతసించగ రాదు
       విభవంబు నమ్మి గర్వింప రాదు
తల్లిదండ్రుల మీద దప్పులెన్నగ రాదు
         భూసురోత్తములతో బొంక రాదు
పొరుగు వారిండ్ల కెప్పుడు పోవగా రాదు
          మత్తిల్లి సుగుణముల్ మరువ రాదు
సరగున జీవహింసకు బాల్పడగ రాదు
           చెడువారితో జెల్మి చేయ రాదు
తే ll సరవి పెద్దల హాస్యంబు సలుప రాదు
వేయి శ్రమలున్న హరిభక్తి విడువ రాదు

సీ ll 42
తిరమొప్ప వేముకు దీపుపుట్టినగతి
         పరగకుందర పంట పండి నట్లు
నుల్లికిమేల్తావి యొదవిన కైవడీ
          జీకువునకు దృష్టి చేకురుగతి
కోకిలా లాపంబు కోడికబ్బిన రీతి
            జెలగి మేడికి బువ్వు గలిగి నట్లు
బొగ్గుకస్తూరి యై పొలుపుగాంచిన రీతి
             చిలువకు నమృతంబు కలిగి నట్లు
తే ll మాన సంబున దుర్నీతి మరువ లేని
పాపికిని నాకు నీనామ భజన గల్గె

సీ ll 43
తలిదండ్రులున్న సోదరులెంద రుండిన 
         దనువువిడుచు నాడు తరలి రారు
తమకించి యెంత విత్తముగూడ బెట్టిన
          మానవులకు నాస మాన బోదు
కడుపున కైవట్టి  కష్టము లేగాని
           చూడగా పుణ్య మించుకయు లేదు
దుష్కార్యముల జేయ దోచెడి నేగాని
          మంచి కార్యంబను మాట లేదు
తే ll చాలు సంసార మికజన్మ జన్మమునకు
స్వామి నీదాస్యమే నా కొసంగు మయ్య

సీ ll 44
బహుసంపదల జూచి బాంధవులను జూచి
          తనయుల గాంచి సంతసము మించి
ధాన్యరాసులు జూచి తరుణీమణుల జూచి
        వాహనంబుల జూచి వాంఛ చెంది
బృత్యవగము జూచి భోగంబులను జూచి
          మందిరంబులు జూచి మమత నొంది
తగుప్రభుత్వము గాన్చి తనశౌర్య  మెదనెంచి
            మదిలోన హర్షించి మదము మించి
తే ll నిక్కమని దేహమును నమ్మి నిన్ను మరచి
తుదకు ఫలమేమి గాంచునో దుర్జనాళి

సీ ll 45
శ్రీయుతంబుగ నీదు సేవ యొనర్చిన
         గామితార్తము లెల్ల గలుగు చుండు
నుల్లంబు నందు నిన్నల్లన దలచిన
         నజ్ఞాన మోహంబు లణగు చుండు
నోరూర నిన్ను నింపార నుతించిన
          గాలుచే నగుభీతి ధూలు చుండు
నతిభక్తిచే నీకు నతులొన రించిన
            వెసభవ బంధము ల్వీడు చుండు
తే ll నిన్ని సౌఖ్యము లొసగెడి నిన్ను వీడి
యొరుల గొలచిన సౌఖ్యమే కరణిగల్గు

సీ ll 46
బలమెంత గలిగిన భాగ్యంబు గల్గిన
         దోడ నొక్కటియును గూడి రాదు
క్రొవ్విమున్జేసిన క్రూర కర్మంబులు
           గాసిపెట్టును గాని వాసి పోవు
కాయమెవ్విదమున గాచి రక్షించిన
           నిక్కమీ దరణిపై నిల్వ బోదు 
సౌదర్య ములును నెంచగ జమత్కారముల్
           కాలంబు నందు నక్కరకు రావు
తే ll ఇట్టి వ్యర్ధపు కోరిక లెల్ల వీడి
దిట్ట మగుభక్తి నిన్ను నుతింతు నేను

సీ ll 47
విష్ణు భక్తుల మోము వీక్షించి నన్ జాలు
         సుకృతహీనుల మోము చూడ రాదు
హరిదాసులకు దండ మర్పించి నన్ జాలు
         దురిత కర్ముల చెంత కరుగ రాదు
పుణ్య మానసులను పూజించి నన్ జాలు
          పాపాత్ములను నోట బలుక రాదు
భాగవతుల తోడ భాషించి నన్ జాలు
            క్రూరులతో జేల్మి కోర రాదు
తే ll హితము గా నీకు వందనం బిడిన జాలు
నిక్కముగ నితరుల కిక మ్రొక్క రాదు

సీ ll 48
ఆలోచనంబు లె న్నైన నేర్వగ వచ్చు
            నిన్ను నాలోచింప నేర్చు టరుదు
అకటదుర్భాష లెన్నైనను వినవచ్చు
            నీ కథలను విన నేర్చు టరుదు
షడ్రసంబుల రుచి సరగున గొనవచ్చు
            నీనామ రుచిజూడ నేర్చు టరుదు
దర్పాంధులను గని దండంబు లిడవచ్చు
             నీకు దండము బెట్ట నేర్చు టరుదు
తే ll సుందరా భాసులగు వారి చూడ వచ్చు
నీర జోదర నినుజూడ నేర్చు టరుదు

సీ 49
పన్నగ శయన నన్బాలింపు మంటిని
         గరుడవాహన నన్ను గావు మంటి
దేవ నన్గావ నీదేభారమంటిని
          వేరు దైవంబుల వేడ నంటి
లోకంబు లెల్ల నీలో నుండునంటిని
          దలపోయ నీవు నా తండ్రి వంటి
కోపించి నన్ను జిక్కులు వెట్టకుమ టంటి
          సంతరించుట కిదే సమయ మంటి
తే ll మతములిక నేమియును లేక మాని యుంటి
నభవ ననుబ్రోవు మనుచు నిన్నడుగు కొంటి

సీ ll 50
బ్రతుకున కెవ్వరి బ్రతిమాల వలయునో
            యేవేల కేకష్ట మింక గలదొ
దొరకొని యెట్టి వ్యాధులు సంభ వించునో
          కాయమేస్థలమందు బాయ నగునొ
అటజిత్రగుప్తు డేమని వ్రాసి యుండునో
         యలకృతాంతుండెట్టి యాజ్ఞ యుడునొ
యమభటు లెంత భయంకరాకారులో
           బెట్టుగా నెటుబాధ బెట్ట గలరొ
తే ll దైవమా యిట్టి కష్టముల్ దలచి తలచి
యిన్ని దొలగింప నిన్నాశ్ర యించి నాను

సీ ll 51
కడుదుష్టులను గూడి చెడదలంచితి గాని
          భాగవతులపంచ బట్ట నైతి
తీరిన పోరిగిండ్ల తిరిగితి నే గాని
           పరమాత్మ హరియని పల్క నైతి
నయ్యాయో దుర్భాషలాలకించితి గాని
           వీనుల నీకథల్ వినక పోతి
దనువు స్థిరంబని దలచితి నే గాని
          నిజముగాదని యెంచ నేర నైతి
తే ll మనుగా దుర్గుణంబులు మాన నైతి
నిష్టతో మదినిన్ను ద్యానింప నైతి

సీ ll 52
ఎవ్వనిపాదమం దెల్ల లోకంభులు
         బావనంబొనరించు పాప పుట్టె 
నెవ్వని నాభియందిరవంద గా జతు
           ర్వదనముల్గల పిల్ల వాడు గల్గె
నెవ్వని యురమునం దెల్లలోకములకు
         గలుముల నొసగెడి కాంత నిలిచె
నెవనికన్గవ రేయు బవలులోకము లెల్ల
          దెల్వి నొందించుచు దేజ మందె
తే ll నట్టి లోకైక నాయకునప్ర మేయు 
బరమ పురుషుని నాయందు బ్రస్తు తింతు

సీ ll 53
వనజాక్షి నీవు ప్రోవక యుపేక్షించిన
       పాపజాతియటంచు బల్క కున్న
గువలయేశ్వర నీకు గోపంబు గల్గిన
         గట్టిగా బలుమారు గసురు కొనిన
జాలనన్నిడుమలపాలు గావించిన 
           దీనభావంబు జెందింపు చున్న
బహువిధంబుల నింద బడునట్లు జేసిన
             దివిరిబల్ గాసి నొందింపు చున్న
తే ll బంత మలరంగ నిన్నె సేవింతు గాని
విహగ వాహన నీభక్తి విడువ జాల

సీ ll 54
అబ్జజుండొసగిన యాయుష్య మందులు
            సగము నిద్దురకయి సమసి పోవు
నలయున్న సగము లోపల బాల్యమందున
             నాటలతోడ కొన్నాళ్ళు జరిగె
మరియౌవనంబున మమతకు లోబడి
             చెనటి కర్మంబుల జేయ నాయె
నంతట సంసార మనుజల రాశిలో
              తిరుమెరుంగక మున్గి తేలి నాయె
తే ll కాల మెళ్లను నిబ్బంగి గడచి పోయె 
ముదిమి దాపాయె దుర్వాన్ఛ వదల దాయె

సీ ll 55
చెలిగి పాంచాలికి చీరలిచ్చిన నాటి
         కరుణ యెందరిగె నో కమలనాభ
మకరంబు ద్రుంచి సామజరాజు నేలిన
          కృప యెందడంగెనో నృపల లామ
కడువడి బ్రహ్లాదు గాచి రక్షించిన
           దయయెందుజొచ్చెనో దనుజ వైరి
గణుతింప నా విబీషణుని చేపట్టిన
           నెనరెందు బోయనో నీర జాక్ష
తే ll దిక్కు నీవని నమ్మిన దీన జనుడ
నిక్కముగ బ్రోవ విదియేమి నిగమ వేద్య

సీ ll 56
ఫలపుష్ప హీనమై పరగు వనంబేల
          తావిలేకుండిన పూవు లేల
బలహీన మైనట్టి నళినాకరం బేల
            వేల్పు లేనట్టి కో వెలయు దేల
పతిమాట మీరిన భామగౌరవ మేల
            దానమించుక లేని ద్రవ్య మేల
సద్గుణంబులు లేని చక్కదనంబేల
            మణినీతి మానిన మాట లేల
తే ll రహిని దారాధి పతిలేని రాత్రి యేల
నిన్ను గొనియాడ జాలని నేర్పు లేల

సీ ll 57
కమలమిత్రుడు ప్రాచి గనుపట్టె నేనియు
           దిమరంబులుండునా దీన పోష
విహగేంద్రు గనులార వీక్షించి నంతనే
          యురగంబులుండునా శరధి శయన
ఘనమారుతమువీవగానె చెలింపక 
           మేఘంబులుండునా మీన రూప
సరవితోడుతను గేసరి బొడగాంచిన
          గరులందు నిల్చినా దురిత దూర
తే ll నీపదాంబుజముల భక్తి నిలిపి కొలుచు
నరుల బాపంబు లోందునా నళిన నాభ

సీ ll 58
ఇందిరావల్లభ యింక నైనను నన్ను
         గావవే నేజేయు కర్మ మేమి
కుటిలారి మర్ధన గొనకొని వేడితి
         బాలింపవే నాదు పాప మేమి
నీలాంగ ననుగావ నీవిటు రమ్మన
          బలుకవే నావ్రాత ఫలమ దేమొ
కరుణ నామీద నిక్కములేశ మైనను
          దలపవే నీకిది ధర్మ మేమొ
తే ll నీకు నాపయినిక దయరాక యున్న
నేడు నేనిక నెవ్వరి వేడ నగున

సీ ll 59
అనుదినంబును నీళ్ళ మునిగిన ఫలమేమి
           ధౌతాంబరంబులు దాల్ప నేమి
హరిణాజి నంబున నధివసించిన నేమి
            యొడలెల్ల భష్మంబు నిడిన నేమి
జపమాలికలు చేత సరగదాల్చిన నేమి
            కన్నుంగవ మొడిడ్చి యున్న నేమి
అన్యులతోమాట లాడకుండిన నేమి
           కొన్ని మంత్రంబులు గొనగ నేమి
తే ll కపట మెప్పుడు మనమున గలుగువారు
లేశ మైనను నీ భక్తి లేని వారు

సీ ll 60
దివ్యసుందర గాత్ర దినకర శశినేత్ర
          భవ్య చారిత్ర శ్రీ పాండురంగ
మందర గిరిధర మాణిక్య యుతహార
         భక్త మందార శ్రీ పాండు రంగ
సారస పత్రాక్షా సమదదానవ శిక్ష
           భద్రేభ రక్ష శ్రీ పాండు రంగ
ఇందిరా హృదయేశ వందారు వాణీశ
         బహుదుఃఖ నాశ శ్రీ పాండు రంగ
తే ll పరగ రాజ తురంగ శ్రీ పాండు రంగ
పాత కాబ్జత మాతంగ పాండు రంగ

సీ ll 61
నీదివ్య నామంబు నిశ్చింత కామంబు
         శాత్రవ భీమంబు చక్ర హస్త
నినునమ్ముకొని యుంట నిఖిలపుణ్యము గంట
         తలపనోముల పంట దైవ రాయ
నిన్నాల కించుట చెన్నురహించుట
            యముని జయించుట కమలనయన
నీపాదయుగ సేవ పాపాంబుధికి నావ
             ముక్తి కల్లదెత్రోవ భక్త పాల
తే ll కాన నినుమాన జాల నిక్కంబు గాను
నిదురలో నైన శ్రీ కామినీసమేత

సీ ll 62
దండికింకర క్రూర దండనం బెడవాపు
           దండమర్పింతు వేదండ వరద
తాపత్రయంబెడవాపి సంరక్షించు
          నీసేవ యొనరింతు బాసు రాంగ
దోషంబు లెల్లను దొలగజేసెడినిను
           నమ్మి నానయ్య శ్రీ నారసింహ
గాసిబెట్టగ మేర గాదుర నీకంటె
            దిక్కెవ్వ రున్నారు దీన పోష
తే ll సుందరా కార సంతతా నంద ధీర
జలధి గంభీర పాషండ జనవిదార

సీ ll 63
స్త్రీజనంబులను రక్షింప రాదంటివా
          పరగగౌతమ పత్ని తెరవ గాదె
కల్మషాత్ముల బ్రోవగారానిచో న జా
           మిళుండు కలుషియై మెలగ లేదె
కులహీనులను బ్రోవ గూడదటంటివా
           విదురుండు శూద్రుడై వెలసె గాదె
నామీద దయలేక ననుబ్రోవ కుంటివా
            శరణార్థులను గాచు బిరుదు లేల
తే ll ఎందుకీమాట లెల్లనో యింది రేశ
తగునె నీకిట్లు నాపాటు దలప కున్కి

 సీ ll 64
పావక జ్వాలల బడకుండ నట్లుగా
          జెంచుల దొరను రక్షించితివని
ద్రోణపుత్రుండేయు బాణంబు వారించి
          గర్భపు శిశువునున్ గాచి తివని
దుర్వాసు కోపాగ్ని దొసగుల బడకుండ
           నంబరీషునిదయ నరసితివని
భావింప నుత్తానపాద తనూజుని
            బొందుగా దయతోడ బ్రోచితివని
తే ll ఘోర పాపాంబునిధి మున్గి కుందుచున్న
నన్ను దరిజేర్తువని నిన్ను నమ్ము కొంటి 

సీ ll 65
పలుమారు బిలచిన బలుకవ దేమయా
          లోక రక్షక పుండరీక వరద
మొరవెట్టి వేడినా మొరవిన వేమయా
           లోక రక్షక పుండరీక వరద
చూడమన్ననుదయ జూడవ దేమయా
              లోక రక్షక పుండరీక వరద
దైవతములకిది తగవగు నేమయా
             లోక రక్షక పుండరీక వరద
తే ll రమ్ము కోపంబు మానుము నెమ్మనమున
నమ్మి నానయ్య నీదుపదమ్ము  లెదను

సీ ll 66
భవసాగరంబున బడిమునింగెడు నన్ను
         గరుణించి నీభక్తి గలుగ జేసి 
దుర్భాషణంబులు దొరకొని వినునన్ను
         విరివిగా నీకథల్ వినగ జేసి 
విసువక నరులను వినుతించు చుండునా
          నోట నీ నామంబు నుడువ జేసి 
విషయేఛ్చ నెప్పుడు వీడకుండెడు నాదు
          చిత్తంబు నీయెడ చెంద జేసి
తే ll తొల్లి నేజేయు పాపముల్ దొలగ జేసి
కరుణ చే జేరవచ్చి నన్గావ మయ్య

సీ ll 67
వేడ్కచే మీనమై వేదముల్ రక్షించి
        కూర్మమై మందర కుదర మెత్తి
ఘనసూకరా కృతి గనకాక్షు నిన్జించి
       నరహరి వై దైత్య నాథు ద్రుంచి
వటుడవై బలిదైత్యు వశుధక్రిందనడంచి
          పరశువు బూని భూపతుల ద్రుంచి
దశరథాత్ముజుడవై దశముఖునిన్ జంపి
           హలపాణి వై మహా ఖలుల ద్రుంచి
తే ll దనుజ సతుల పాతివ్రత్యముల గలంచి
ఘోటకము నెక్కి మ్లేఛ్చాళి గీటడచితి

సీ ll 68
పరమాత్మ నీదు కృపారసంబున గదా
          రుద్రుండు త్రిపురాసురులజయించె
పరమాత్మ నీదు కృపారసంబున గదా
          వేదంబులజునకు వేడ్క దొరికె 
పరమాత్మ నీదు కృపారసంబున గదా
          ఇంద్రుండు భువనంబు యేలగల్గె
పరమాత్మ నీదు కృపారసంబున గదా
          పాండవుల్ సూరులై బ్రతుక కలిగె
తే ll పొసగ నీదైన సతకృపా రసము చేత
దలపగా సర్వ శుభములు గలగ కున్నె

సీ ll 69
వదలక సంసార వార్థియుప్పొంగిన
         న్ముంపగజొచ్చెనో మునివ రేడ్య
అతిశయ విషయేఛ్చలను దవాగ్ని జ్వాల
         లందందనను గాల్చె నంద తనయ
మోహాపదేశ జీమూత సంతతులు న-
          న్గట్టి బాధించెనో కమల నయన
కదలని శోకాంధ కారంబు మునుకొని
          ననుజుట్టి బాధించె నళిన నాభ
తే ll వితత గతితరివగుము సువృష్టి వగుము
కరువలివిగమ్ము తగనుష్ట కరుడ వగుము

సీ ll 70
భువనంబు లెల్లను బుట్టింప బెంపన
          క్కడలిలో ముంపంగ కర్త వీవ
మునిజనంబులు నీవ ముక్కంటియును నీవ
           సూర్య చంద్రులు నీవ సురులు నీవ
యష్టదిక్కులు నీవ యవనీతలము నీవ
           గగనంబు నీవ సాగరము లీవ
పావకుండును నీవ పర్వతంబులు నీవ
            యంబుదంబులు నీవ యజుడ వీవ
తే ll కమల జాడంబు మరినీవ గాడ్పు నీవ
అఖిల మున్నీవ సృష్టిన నాది నీవ

సీ ll 71
బలురోగముల నైన భయముతో నైనను
          చిత్తంబులో కల్గు చింత నైన
జాలవేడుక నైన గేలిచే నైనను
            తీరనిపనుల వేసారి యైన
గోపంబుతో నైన గొనగుచు నైనను
           భావంబులో గల భక్తి నైన
బరులచే హింసల బడుచుండి యైనను
          బేర్మినందనుల పేర్వెట్టి యైన
తే ll దవలి నీనామ మెటులైన దలచి నంత
భానుజుని కింకరులబాధ బాయ కున్నె

సీ ll 72
అతిపాప మతియైన యయ్యజామీళుని
          జెలిగిపుణ్యాత్ముగా జేసితౌర
యాదశాస్యుని తమ్ముడగు విభీషణునకు
           నిరవందగా రాజ్య మిచ్చి తౌర
యపరాధ మొనరించి నట్టి కాకాసురు
           గరుణించి వేవేగ గాచి తౌర
వేడ్కతో నీకథల్ వినిన ఘంటాకణున్
             దిరమొప్ప ముక్తి జెందించి తౌర
తే ll యిట్టి కరుణాంబునిధివి ని న్నెన్న దరమె
భక్త మందార యాపద్మ భవుని కైన

సీ ll 73
ప్రీతి బృంగములకు బిసరుహంబుల యంద
           యాకొన్న మనుజుల కన్న మంద
నిరుపేద వారికి నిక్షేపములుయంద
           బాలురకును దల్లిపాల యందా
వాడు సస్యములకు వర్షసంతతి యంద
           తగమునీశ్వరులకు దపము నంద
యవనీసు రేంద్రుల కతినిష్ఠ లందున
            నధికశూరుల కెల్ల యాలమంద 
తే ll సాధులగు భక్తులకు హరిస్మరణ యంద
చేరి యుండును జిత్తంబు సార సాక్ష

సీ ll 74
అల్పవృత్తిని శూద్ర నన్నంబు గుడువవో
           గోపాంగ నలచేత గొట్ల బడవొ
కోతుల గుంపులో గోరివర్తింపవో
              కరమర్థి రోటికి గట్ట బడవొ
అరుదుగా మరదికి నరదంబు గడపవో 
           తురకనిన్ దరుమగా బరువులిడవొ
గోచిబాపని యటుకులు వేగ మెక్కవో
             యరిభీతినబ్ధి గాపుర మెనయవొ
తే ll నీచరిత్రంబు లెల్లను నెమ్మనమున
దలచి చూడంగ గడు జోద్యములుగదయ్య

సీ ll 75
తప్పులనోర్వ నా తల్లిదండ్రులు నీవ
          ప్రీతి సర్వమొసంగ దాత వీవ
మంచిబుద్దులు చెప్ప మాకుగురుడ వీవ
              తోడయి వర్తింప జోడ వీవ
పాపంబు లెల్ల బాపను దైవమవు వీవ
            రక్షిచుటకు మహారాజు వీవ
భావింపగా నాదు భాగ్యమెల్లను నీవ
            నిఖిలేశ నాకు నన్నియును నీవ
తే ll అప్ప మాయప్ప నాదు రత్నాల కుప్ప
యొప్పుగా నీవు నాపాల యుండు మప్ప

సీ ll 76
అహహ నీదివ్య గేహంబు శ్రీ వైకుంఠ
             మంబుజ సంభవుండాత్మ భవుడు
శంభుండు చెలికాడు జలధికన్యక భార్య
              కమలారి భానుండు కన్నులరయ
నిఖిల దేవతలును నీపరిచారకుల్
              వైనతేయుడు నీకు వాహనంబు
పన్నగ నాథుండు పరగనీతల్పంబు
               క్షీరాంబు రాశినీ యూరు పట్టు
తే ll కాన నీకంటె దైవంబు గాన నెందు
నీవ దిక్కని నమ్మితి నిక్క ముగను

సీ ll 77
హరియని నీదు రెండక్షరంబులు బల్క
            రక్కటా బహుభాష లాడగలరు
హరికథ లన్నచో నాలింప జాలరు
          విటులసుద్ధికి జెవుల్ విప్ప గలరు
పక్షివాహనుడన్న వీక్షింప జాలరు
         సుందరాంగులన్న చూడ గలరు
కపటదైవముల నిక్కంబంచు నెంతురు
          నారాయణుండన్న నమ్మ లేరు
తే ll పామరుల కెల్ల నిదియెస్వభావ మైన
సుజనులగు వారు విడనాడ జూడ వలదె

సీ ll 78
కాంచనంబున నుండు కల్మషంబుడగదే
           పటుతరపుటపాక భంగి వలన
దండులంబులనుండు తవుడెళ్ళనూడదే
          పొందుగా ముసలంపు బోటు వలన
మాసిన చేలంబు మలినంబు విడువదే
           తేటగా విలసిల్లు నీటి వలన
పరగంగ వెన్నలో బెరుగెల్ల వదలదే
            మవ్వంపు గవ్వంపు మదన మునను
తే ll బెట్ట మదియైన నీయందు జేందె నేని
కలుషములు వాసి స్వఛ్చంబు గాక యున్నె 

సీ ll 79
సంసార మనుమహా జలరాసికిని నావ
             నీనామ మేగదా నీర జాక్ష
కామాద్యహిత ఘోర కాంతార దవదహ్ని
                నీనామ మేగదా నీర జాక్ష
తలపదుర్మదమను దావాగ్నికిని వృష్టి 
             నీనామ మేగదా నీర జాక్ష
కలుషంబులను నంధ కారంబులకురవి
              నీనామ మేగదా నీర జాక్ష
తే ll యిట్టి నీదివ్య నామంబు యిందిరేశ
చిత్తముననిల్పి యున్నాను చింత లేల

సీ ll 80
ఖ్యాతిగా నిట్టుక రాతిపై బాదకం- 
        జాతకంబుంచిన రీతి వాడు
వలమురిడాచేత వొలనొప్పగా దాల్చి
         పచ్చని వలువచే బరుగు వాడు
కరమొప్పగా రెండు కరపంక జములు శ్రీ
          కరకటిస్థలి జేర్చి బరుగు వాడు
వారక మిగుల శృంగారమౌ నుదుట గ -
         స్తూరి నామంబుచే మీరు వాడు
తే ll సుందరంబగు చూపుల జూచువాడు
నట్టె నాకన్న గవగట్టి నట్టు లయ్యె

సీ ll 81
అరయంగ నీ చరణాంబుజ ద్యానంబె
         యమృత పానంబు శేషాహితల్ప
యేపార భక్తితో నీపూజ సేయుట
          యఘము బాయుట జగదంత రాత్మ
నిరతంబు మనమున నీ మూర్తి గాంచుట
          తపము ఫలించుట తపన తేజ
తిరమొప్పగా నీదు దివ్యప్రసాదంబు
          మదికి మోదంబు తామరస నేత్ర
తే ll కాన నీదివ్య నామంబు మానసమున
మరువ కే బ్రస్తు తించేద మదన జనక

సీ ll 82
మునుగుచేలున కిచ్చు ఘనమైన సంపద
             ల్వల్లవీరమణ నే నొల్లనయ్య
యాంజనేయున కిచ్చు నధికాయు నైనను
              వల్లవీరమణ నే నొల్ల నయ్య 
రాక్షుసేంద్రున కిచ్చు రాజ్యసుఖంబైన
             వల్లవీరమణ నే నొల్ల నయ్య 
యిరవింద ద్రౌపది కిచ్చిన చేలము
             ల్వల్ల వీరమణ నే నొల్ల నయ్య
తే ll ఎల్లకాలము నాదగు నుల్ల మందు
నింపుగా నీవు వసియింపు మింతె చాలు

సీ ll 83
కోటిసూర్యుల తోడ నీటైన నవరత్న
          కోటీరమును దాల్చి కొనిన వాని
గరితుండ ములబోలు కరముల మణిమయ
           కేయూర యుగ్మంబు గెరలు వాని
సలలితంబైన వర్షాకాల నీలాంబు
            దముభంగి నల్లని తనువు వాని
బాగైన తనయురో భాగంబు నందు శ్రీ
          నళినాక్షు నిధరించి నట్టి వాని
తే ll గనక యమచేలమును గట్టి కొనిన వాని
నామనంబున నెపుడు ద్యానంబు జేతు

సీ ll 84
వివరింప దుఃఖాటవీ దాహకంబులు
           మోక్ష లక్ష్మీ చిత్త మోహనములు
మడమోహ లోభాబ్జ మదవారణంబులు
            గణుతింపగా శుభ కారణములు
పొందుగా సజ్జన బృందావనంబులు
            పరికింపగా జన్మ పావనములు
పటుతర క్రోధ సంకటవిసర్జనముల
           భ్యర్హిత బహు సుకృ తార్జనములు
తే ll మానుగాయోగి జనులకు మంతనములు
సంత తంబున నీపాద చింత నములు

సీ ll 85
అడవుల జరియించి యాకుభక్షించిన
         భూతిమైనిండను బూసి కొనిను
రమణరుద్రాక్ష హారములు ధరించిన
          గాషాయ వస్త్రము ల్గట్టు కొనిన
సదమల హృదయలై స్నానంబు చేసిన
         నితరపురాణంబు లెన్ని విన్న
నతులితముగ నెట్టి వ్రతమాచ రించిన
          బ్రజలు యోగియటంచు బలుకు చున్న
తే ll రూఢిగా నిన్ను గొల్వ నేరుంగ కున్న
నంబు జోదరయవి నిష్ఫలంబులుగద

సీ ll 86
నీకాంత శ్రీకాంత నిఖిలలోకములకు
          సలలితంబుగ సంపదలనొ సంగు
నీ సుతుండజుడు మానితకార్య నిపుణుడై
           యఖిలజీవులకును నాయు వొసగు 
నీపుత్రి మందాకినీ దేవి భువనముల్
            నయమొప్పగా భావములు సేయు
నీకనుల్ శితకర నీరజ బంధులు
          చెలగి రేయి బవళ్ళు సేయ గలరు
తే ll కల్గు జగముల కెల్లను గర్త వీవ
మంద రోద్ధార సనకాది మౌని వంధ్య

సీ ll 87
జలజాక్ష నీపాద జలరుహంబులు సోక
          నెలకొని చెట్రాయి నెలత మయ్యె
నగ భేదినుతనీదు నామంబు పఠియించి
            ముడముతో శబరి సన్ముక్తి గాంచె
శరణార్థి రక్షక శరణు నీకనివచ్చి
              రావణానుజుడెల్ల రాజ్య మేలె
ఖగవాహ ద్రౌపదీ కాంత నిన్నునుతింప
           పగతుల చేభంగ పాటు వాసె     
తే ll గాన నీపాద కమలము ల్మానసమున
నమ్మి యున్నాను రక్షించు నళిన నాభ

సీ ll 88
పాండురంగాయని పలుమార్లు పిలచితి
          పలుకవే నీకింత పంత మేల
విఠ్ఠ లేశాయని వివరించి పిలచితే
           పలుకవే నీకింత పంత మేల
రుక్మిణీ వరయని రూడించి బిలచితే
              పలుకవే నీకింత పంత మేల
చక్రపాణీయని సరగున బిలచితే
               పలుకవే నీకింత పంత మేల
తే ll ప్రేమతో నంతగా నిన్ను బిలచు చున్న
బల్క కున్నావు నీకింత పంత మేల

సీ ll 89
కడుదూర మౌటచే ఘనముగా నామొర
         వినరాదకోనీకు వేద వేద్య
వనగజేంద్రుని మొర వైకుంఠ మందుండి
           వేలాగు వింటివో నీల వర్ణ
ద్రౌపదీసతిమొర ద్వారక లోనుండి
          యేరీతి వింటివో సార సాక్ష
ప్రహ్లాదు మాటను పాటించి జగమున
          నెటునిండియుంటివి యీశ్వ రేశ
తే ll యిట్టి నీకెద్ది దెలియద దెంచి చూడ
బక్ష బాతంబుగా బోలు పక్షి వాహ

సీ ll 90
ఎలిమినాదగు మనంబెవ రెరుంగకు యున్న
       నీ వెరుంగవె నీల నీర దాంగ
జనులకు బన్కిమాలినవానినై యున్న
           నీ వెరుంగవె నీల నీర దాంగ
నరులు క్రోధంబున ననుగేలి సేయుట
           నీ వెరుంగవె నీల నీర దాంగ
ప్రజలు నన్నెటువంటి పల్కులు బల్కిన
             నీ వెరుంగవె నీల నీర దాంగ
తే ll నేను మొరవెట్టు చుండుట నీకు దెలియు
జోకతో వినుచుండుట నాకు దెలియు

సీ ll 91
తిమిరంబు వాపనాదిత్యు డొక్కడె జాలు
            నేలమిణ్గురుపుర్వు లెన్ని యైన
అవని దాల్పంగ శేషాహి యొక్కడె చాలు
             నేలొకో  నీర్గట్టు లెన్ని యైన
శరనిధి దాటింప ధరణియొక్కటె చాలు
             నేలొకో యారిగెల వెన్ని యైన
సకలంబొసంగ గల్పక మొక్కటియె జాలు
             నేలకానుగు మ్రాకు లెన్ని యైన
తే ll గలుషముల బాప నీవ యొక్కడ జాలు
నేల చింతింప దైవంబు లెంద రైన

సీ ll 92
ఓ జగ ద్రక్షక యోజగ త్కారణ
          యోజగన్మోహన యోముకుంద
యోసచ్చిదానంద యోసదుణాకార
           యోనిత్యా కళ్యాణ యోపరేశ
యోధరామరనుత యోరవినిభ తేజ
         యోదీన వత్సల యోదయాబ్దె
యోపాప సంహార యోసుదర్శన ధర
            యోసుందరాకార యోమహాత్మ
తే ll యన్య మెరుగను నీదు పాదాంబుజములు
నాకు దిక్కని మనమున నమ్మి కొంటి

సీ ll 93
అతిసత్య నిరతుడౌ నా హరిశ్చంద్రుండు 
           కష్టపడుట గాక కాంత నమ్మె
కుంతీసుతులు నైదుగురు శూరు లైయుండి
          నాతితో గూడి కానలకు జనిరి
నిషధభూధవుడు మానిని బాసికుందుచు
            నీచునిగతి నొక్క గోచి దాల్చె
వశుదేవు డతివైభవము వాసి భీతితో
               జంటి బిడ్డల నెల్ల జంప నిచ్చె
తే ll వారి కేయిన్ని కష్టము ల్వచ్చి యుండ
వగవ నేటికి నింక నెవ్వార లైన

సీ ll 94
కడుభయ దాకృతుల్ గలకాల కింకరుల్
          నిక్కంబుగా జెంత నిలుచు వేల
వాండ్రు నీండ్రును వచ్చి వగచుచు వీక్షించి
           పేరెత్తి పల్మరు బిలుచు వేల
కనలేక వినలేక గాసికోర్వగ లేక
            పొలుపేది గళమెండి పోవు వేల
పొరలుచు మూల్గుచు జరణ ముల్దన్ను చో
           గాఫవాత పైత్యముల్ గప్పు వేల
తే ll బరగ నీదివ్య నామంబు బలుకు నట్లు
నాకు దయసేయు మ్రొక్కెద లోక నాథ

సీ ll 95
సిరిగల్గు వాడని చిత్తంబు లోపల
          ఖండి తంబుగ గుచేలుండు దలచె
భావమరందిగా భావంబు లోపల
       బ్రియముతోడుత దనంజయుడు దలచె
దనశత్రు డనుచును దగమానసంబున 
          దుర్మతియైన చైద్యుండు దలచె
హృదయేశ్వరుండని హృదయంబు లోపల
           భాసురంబుగ సత్య భామ దలచె
తే ll జారుడనుచును పల్లవ చారుముఖులు
దలచి రేగాని హరియంచు దలప రైరి

సీ ll 96
శ్రీజయ దేవుల చిత్తశుద్ధికి జాల
        మెచ్చి కాల్సేతుల నిచ్చి నావు
నామదేవులు పెట్టు నైవేద్య మెల్లను
        మించి సాక్షాత్తు భుజించి నావు
జ్ఞానదేవుల తోడ మానుగా గుడ్యంబు
         చెన్నొంద నడచిపో జేసి నావు
బోసల బావకై కాసుల మోయుచు
         వెట్టి తనంబు చే పట్టి నావు
తే ll ఆడ కాడకు మనమున నద్భుతంబు
గలిగె గదవయ్య నీ దివ్య కథలు వినిన

సీ ll 97
అన్నంబుబెట్టి నిన్నలరింప జేయగా
        వరుస రుక్మాబాయి వనిత గాను
భక్తిచే మెప్పించి పనులు సేయింపగ
       దలప జనాబాయి తరుణి గాను
బ్రాణవాయువులు తప్పక నీకు నర్పింప
         సరసకానో బ్రాతి సతిని గాను
వలనొప్ప పూజించి వశము జేసి కొనంగ
          మరియు మీరా బాయి మగువ గాను
తే ll జెలగి నినుమెచ్చ జేయ నా చేతగాదు
నీవె దయయుంచి రక్షించు నిగమ వేద్య

సీ ll 98
తలపోయ నాల్గు వేదంబులు మహిషంబు
           నిక్కంబు చదువుట దొక్క వింత      
కోసిభక్షించిన కోడెతానుండిన   
            కొట్టంబులో నుంట  గొప్ప వింత
అల్లన జిచ్చులో బిల్లికూనలు మూడు
           కాలక యుండుట చాల వింత
గ్రక్కున మట్టిలో ద్రొక్కి జంపిన బాలు
          మలయంగ దెచ్చుట మరియు వింత
తే ll పరగ నీనామ మెప్పుడు పలుకు వారు
వేడ్కతో ముక్తి  గాంచుట వింత యౌనె

సీ ll 99
అలజనాబాయి జీర్ణాంబరంబును గొని
        యెలమి గాంచన చేల మిచ్చి నావు
కడునీచుడనక చోకామేళు పంక్తిని
         బెరుగునన్నము మెక్క మరిగి నావు
పరగ సేనానావి భక్తున కైపోయి
       దొరకు క్షవ్ రముసేయ నెరిగి నావు
దలపోయగా గపీర్ధాసుని యింటిలో
         నెరి వస్త్రములు నేయ నేర్చి నావు
తే ll ఔర పనివాడ వౌదు వేమందు నిన్ను
నచ్చు గారుక్మిణీ దేవి మేచ్చ కున్నె

సీ ll 100
బాలప్రాయము నుండి భాసురంబుగనునీ
         పాదాబ్జములు నమ్మి బ్రతుకు చుంట
నంచిత భక్తితో నలరుచు నీ దివ్య
          చారిత్ర మేవేళ జరుపు చుంట
నిశల బవళ్ళను నీశుభాకారంబు
           చెలువంద ద్యానంబు సేయు చుంట
నిరతంబు నీకును నీదాస జనులకు
          బాయకెప్పుడు నతుల్ చేయు చుంట
తే ll జేరి నీకథలను విన గోరు చుంట
నభయ మీవయ్య వేగ నన్నాదరించి 

సీ ll 101
ఆడ కాడకురుచి యధికమై యొప్పెను
           మానుగా నిన్నింక మరువ జాల
దినదినంబునకు నా మనమెల్ల గరిగెను
            మానుగా నిన్నింక మరువ జాల
బ్రతికి నన్నాల్లు నీ పదములర్చించెద
             మానుగా నిన్నింక మరువ జాల
వేసారి నీవెంత విడనాడ జూచిన
              మానుగా నిన్నింక మరువ జాల
తే ll దానవాంతక నమ్మిన దాసు నయ్య
మానసంబుణ నిన్నింక మరువ నయ్య

సీ ll 102
దాన ధర్మక్రియా తతులకన్నిటి కంటె
            భావింప నీపాద భక్తి మేలు
సత్యక్ష మాశౌచ సద్వ్రతంబుల కంటె
            భావింప నీపాద భక్తి మేలు
అశ్వమేదాధి మహాధ్వరంబుల కంటె
             భావింప నీపాద భక్తి మేలు
తీర్థయాత్రల వెంట దిరిగి యాడుట కంటె
             భావింప నీపాద భక్తి మేలు
తే ll నిరతమును నిన్ను గొనియాడు నిశ్చలునకు
బాప సంఘంబు లెన్నైన బాయ కున్నె

సీ ll 103
పాటింపగా బొమ్మలాట కాడవు నీవు
        పొలుపేది జంత్రంపు బొమ్మ నేను
తిరుగలి చేబూని త్రిప్పువాడవు నీవు
         చెలువేది తిరుగు తిర్గలిని నేను
మేలుగా నేర్చిన మిషణుకాడవు నీవు
         మిటమిట దిరెగెడు మిషను నేను
వివరింప గారడి విద్యకారుడ నీవు
            వేడ్కతో నీచేతి విద్య నేను
తే ll బరగ నీవెట్లు ద్రిప్పిన దిరిగు చుందు
నీవు చాలించి నంతనె నిలచి పోవు 

సీ ll 104
దామాజి పండితు దయజూడగా నెంచి
        తలవరి నైతివా దళిత దోష
యేకనాథుని యింట నేపారగా బరి
         చారకు డైతివా మార జనక
రోహిదాసునకు నై రూపింపగా జర్మ
      ఫీఠ మందుంటివా బిసరు హాక్ష
సామంతునకు గాక బ్రేమతోడుత దోట
        ద్రవ్వితినా ఘోర దైత్య హరణ
తే ll భక్తులకుజిక్కి గాదెయీ పనులు నీకు
గలిగె నింతకు భక్తి యే కారణంబు

సీ ll 105
అమరులునుతి సేయ నఘముల బోద్రోయ
          బాండవులను గావ బ్రజల బ్రోవ
ధరణిభారమడంప దానవులను ద్రుంప
         బ్రకటించు లీల గోపికల నేల
గౌరవులను మాప గడుజిత్రములు జూప
           దపసుల బెంప బాతకుల జంప
గంసుశిక్షింప లోకము లెల్ల రక్షింప
          దురితము ల్గాల్ప సాధువుల దేల్ప
తే ll గట్టిగా దేవకీ  దేవి గర్భ మందు
 బట్టివై పుట్టితివి జగజ్జట్టి వీవు

సీ ll 106
తప్పులెన్నున్నవో దయజూడు నీకునే
         మెప్పుగా పద్యముల్సెప్ప గలనె
తోచునా నాకేమి యోచన దెలియునా
          నాచంద మెరుగవా నళిన నేత్ర
యేరీతి జెప్పిన భారంభు నీదెగా
           నేరంబు లెంచకు నిర్మలాత్మ
పూనినిన్గొనియాడ నేనెంత వాడను
         హీనమానవుడును నెంచి చూడ
తే ll నప్ప నినుదప్ప నన్యుల నాశ్ర యింప
దప్పు లెల్లను క్షమియింపు తండ్రి భంగి

సీ ll 107
జయజయ క్షీరాబ్ధి సంభవా హృదయేశ
          జయజయ భవనాశ జగద దీశ
జయజయ వరమేఘ సన్నిభ శుభగాత్ర
          జయజయ సుచరిత్ర జలజ నేత్ర
జయజయ నిఖిల సజ్జనబృంద పరితోష
          జయజయ మృదుభాష సర్వపోష
జయజయ మినిచిత్త జలరుహ సంచార
            జయజయ భీకర సమర శూర
తే ll జయవి నింజిత పటుతర శత్రు జాల
జయధ రామర వందిత చరణ కమల

సీ ll 108
శ్రీకరంబైన వసిష్ఠస గోత్రుడై
           పరగ రామస్వామి పట్టి నైతి
గడుసద్గుణంబులు గల్గు శేషాఖ్యున
             కిరవిందగా సహో దరిని నైతి
బ్రియముతో జనులెల్ల బిలుచుట కవనిలో
           నయమొప్ప శేషమ నామ నైతి
దలపోసిచూడ నీ దాస జనాళికి
           భాసుర మతితోడ దాసి నైతి
తే ll లాలితంబుగా నీభక్తు రాల నైతి
బూని శతకంబు జెప్పిన దాన నైతి
            



         

             
 ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం    









            
           





Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం