వినాయక వ్రత కల్పం

శమంతకమణి కథ

ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికి దేవర్షి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం కావడంతో ‘ఈ రోజు వినాయక చతుర్థి. చంద్రుణ్ని చూడరాదు. కనుక, తను బయల్దేరుతాన’ని జరిగిన వృత్తాంతం అంతా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు ‘ఈ రోజు చంద్రుణ్ని చూడరాద’ని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. కాసేపయ్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ‘ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా’ అని చింతించాడు.

కొన్నాళ్లకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి శమంతకం అనే పేరు గల అద్భుత మణిని సంపాదిస్తాడు. ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ని సందర్శిస్తాడు. అతణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి, ‘ఈ మణిని మన రాజుకు ఇమ్మని’ అడుగుతాడు. ‘రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చే ఈ మణిని తాను ఎవ్వరికీ ఇవ్వనని’ తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. ‘సరే నీ ఇష్టం’ అని ఊరుకుంటాడు కృష్ణుడు. ఇలాకొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచుకొని వెళ్లిపోతుంది. మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి (జాంబవంతుడు) సంహరించి ఆ మణిని తీసుకొని గుహకు వెళ్లి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది.

మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ‘ఆ రోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని, నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని’ నగరమంతా చాటింపు వేయిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి ‘అయ్యో ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు’ అని అనుకున్నాడు. ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధుసమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు. ఒకచోట ప్రసేనుని మృతదేహం, ఆ పక్కగా సింహం కాలి జాడలు, కొంత దూరం వెళ్లాక ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి. వాటివెంట కొంతదూరం వెళ్లగా ఓ గుహ కనిపిస్తుంది. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు. కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు. కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్యా 28 రోజులు యుద్ధం కొనసాగుతుంది. క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవుతాడు. ‘నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే!’ అని గుర్తించిన జాంబవంతుడు ‘దేవదేవా! భక్తజన పాలకా! నీవు శ్రీరామచంద్రుడివని నేను గుర్తించాను. త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకొమ్మని అడుగగా, నేను బుద్ధిమాంద్యంతో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. ఇంతకాలానికి నా కోరిక తీరింది’ అని కృష్ణుడిని కీర్తించాడు జాంబవంతుడు.

కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి మణిని ఇమ్మని కోరాడు. ‘స్వామీ! ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ని చేయమని’ అభ్యర్థించాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయల్దేరుతాడు. తర్వాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమంతకమణిని అతడికి ఇచ్చేస్తాడు. కృష్ణుడిని అనుమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరుతాడు. శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది.

ఈ వివాహానికి తరలి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుణ్ని స్తుతించి ‘స్వామీ! మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు. మరి, మాలాంటి సామాన్యుల గతి ఏమని’ ప్రార్థించారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ‘ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివి, విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ని చూసినా ఎలాంటి నిందలు కలుగవ’ని అభయమిచ్చాడు. దాంతో అందరూ సంతోషిస్తారు.

నాటినుంచి ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ చతుర్థినాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి, తాము సుఖంగా జీవిస్తున్నారని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి, అక్కడే ఉన్న ధర్మరాజుతో ‘నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది. దీన్ని ఎంతోమంది భక్తితో ఆచరించారు. ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుని, శ్రీకృష్ణుడు జాంబవతిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుణ్ని సంహరించాడు. సకల విజయ ప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి’ అని చెప్పాడు సూతుడు. అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలనూ, రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు.

ఇది శ్రీ స్కాంద పురాణంలో భాగమైన ఉమామహేశ్వర సంవాదంలోని వినాయక వ్రతకల్పం.

సేకరణ యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం