శ్రీకృష్ణ స్తుతి దండకం

#కళాపూర్ణోదయం లోని మణికంధర రచిత కృష్ణస్తుతి
దండకము.
శ్రీ కామినీ కామి తాకార! సాకార కారుణ్య ధారా నవాంకూర శంకాకరా శోణ రేఖా మయూఖాళి కిమ్మీరి తాలోక నాలోక! లోకైక సంస్తుత్య నిత్యప్రభావా! విభా వైభ వాధిక్య ధిక్కారి తానంత మార్తాండ కోటీక! యాటీక మానామలాస్తంభ శుంభ ద్యశఃపూర కర్పూర సౌరభ్య మైత్రీ పవిత్రీకృ తామ్నాయ వాయు ప్రచారా! నిశాపాది తాపార సంసార సంతాప  నిర్వాపణా!పాప నిర్వాపణోపాయ నామ ప్రశం సానుభావా! భవా భావ లో భాకులీభూత చేతస్సుధీ వ్రాత నిర్ణీత సంప్రాప్త సద్భక్తి మార్గైక విశ్రామభూమీ భవ తత్వ రూపా! సురూపావళీ దుర్నిరూప స్వరూపా! గురూపాస నాసాదితా నారతానన్య సాంకర్య కైంకర్య మాధుర్య ధుర్య ప్రపన్నా! ప్రపన్నావళీమాన సోదస్తభోగావర్గాభిలాషా! హృషీకేశ! యీశాన వాణీశ ముఖ్యుల్ సువిఖ్యాత మైనట్టి నీదివ్య చారిత్ర చారు ప్రచారంబు పారంబు ముట్టన్ , నుతింపంగ లేరంచు నెంచంగ , వించుం బ్రపంచ స్వభావంబు, భావంబునన్ మాన కిట్లేము నీ ముందటన్ జాటు వాచాటతల్ చూపుచున్నార; మి న్నేరముల్ మన్ననం జేసి సైరింపు మో వాసుదేవా! సదానంద! గోవింద! నీ విందు మా విందవై, డెంద మానంద మొందింప, నెందున్ విచారంబు లేమిన్ , వచో గోచ రాగోచరత్వంబు  లూహింపలే మైతి మోదేవ! మీ పాద సేవాదరంబున్ మదిం గోరుచున్ వేద వాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి ,భోగేశ్ఛ వర్జించి, నానా తపశ్చర్య లాశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునం గైకొనన్, మాకు నే యత్నముల్ లేక, యో కృష్ణ! యీ కైవడిన్ మీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్, బుద్ధిఁ దర్కింప నత్యంత చిత్రంబు గాదే? జగన్నాథ! యీ రీతిఁ జెన్నార, మున్నే ఋషుల్ మిమ్ముఁ గన్నారఁ గన్నారు, మా కన్ను లెన్నంగ నే పుణ్యముల్ చేసెనో  యీ విశేషంబుఁ గాంచెన్, విరించోదయస్థాన నాభీ సరోజా! సరోజాతజా తాండముల్ తండ తండంబులై యుండ, నొండొండ నీ రోమ కూపంబు లేపారఁగాఁ  దాల్చుటల్ చెప్పఁగా, నీవు గోవర్ధం బెత్తి తంచున్, వరా హావతారంబునన్ ధారుణీ  చక్రముం దాల్చి తంచున్, మహా కూర్మభావంబునన్  మందర గ్రావమున్  మోచి తంచున్, జగంబుల్ సమస్తంబు  ద్రైవిక్రమ ప్రక్రియా వేళఁ బాదత్రయిం జాలఁ బూరించి తంచున్ నుతింపంగ యుక్తంబె? భక్త ప్రజాధీన! దీనిన్ వివేకింంచి లోకంబులోఁ గొందఱార్యోత్తముల్ సర్వ వేదంబులున్ సర్వ వాదంబులున్ సర్వ యాగంబులున్ సర్వ యోగంబులున్ సర్వ మౌనంబులున్  సర్వ దానంబులున్ జూడ, నీ దాస దాసాను దాసాంఘ్రి సంసేవలోఁ  గోటి కోట్యంశముం  బోలఁగాఁ జాలవంచుం, ద దాచారంముం బూని వర్తింతు రత్యున్నతిన్; సత్య సంకల్ప నిత్యోదయా! యేము నీనామ మాత్రంబు మా నాలుకం జేర్చుటల్ దక్క నొక్కింతయుం   దక్కు త్రోవల్  భవన్మాయ దాఁటంగనే, మవ్యయా! భవ్య యోగీంద్ర, సాంద్రాద రాకాంక్షి తైకాంత సంసేవనా! భావ నాతీత కల్యాణ! నానా గుణశ్రీ సముద్భాసితాంగా! మముం గేవలంబైన కారుణ్య దృష్టిం గటాక్షించి రక్షించు, లక్ష్మీ మనోవల్లభా! దేవా! దేవా! నమస్తే నమస్తే నమస్తే నమః.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం