హాస్య పద్యం చమత్కారం

To those who love Telugu poems:

*శ్లేష తో  చమత్కారం !*
కవుల మాటలేకాదు. కవిత్వభాష వంటబట్టినవారు కూడా చమత్కార భాసురంగా మాటలాడగలరు. ఆమాటలలోని  చమత్కారం ఆభాష తెలిసినవారికే అర్థమవుతుంది!

ఈ కింద కంద పద్యం చిన్నదే కానీ చమత్కార రంజితమై, సరసుల హృదయరంజకంగా మారింది.

క: *చవిగొని ఫలములుఁ గొననా?*
*చవిజూచిన పండ్లురాలు; చక్కగ బొమ్మా!!*
*కవినేను, కనులఁ గనవా?*
*కవి వైనచొ ,చంకనాకు, ఘంటంబేదీ?*

పూర్వం కవులకు సంఘంలో మంచి గౌరవముండేది. వారెక్కడికి వెళ్ళినా అందరూ వారిని గౌరవించి అడిగినవి సమర్పించేవారు.

ఒక కవిగారు అరటిపండ్ల కోసం బజారుకు వచ్చారు. కొట్టు దగ్గర నిలబడ్డారు. పాపం వచ్చేటప్పుడు *ఘంటం. తాటియాకులు* మరచారు.(అవి వారు కవులని సూచించే గుర్తులు. *బొడ్డు దగ్గర ఘంటం, చంకలో నాలుగు తాటాకులు* ఇదీవారి ఆహార్యం).

కవిగారుదుకాణదారునితో, "చవిగొని ఫలములుఁ గొననా?" అన్నారు. రుచిచూచి నచ్చితే పండ్లు కొంటానయ్యా! రుచికి పండ్లు తీసికోనా?అన్నారు.

దానికాదుకాణదారు,
"చవిజూచిన పండ్లురాలు, చక్కగబొమ్మా?" అన్నాడు. రుచి కోసం చేతులేస్తే పళ్ళు రాలుతాయి, చక్కగా పో!అన్నాడు. ఒక అర్దం పళ్ళురాలుతాయి అని తిట్టినట్టు. మరొకఅర్ధం గెలకున్న పళ్ళు రాలిపోతాయి కెలకవద్దు అని.

కవిగారికికోపంవచ్చింది. "కవి నేను కనుల గనవా?" అన్నారు. ఓ ఆసామీ యెవరనుకుంటున్నావు నన్ను, నేను కవిని, ఆమాత్రం మర్యాద తెలియదా? అని;

దుకాణదారుకూడా తక్కువవాడు కాదు మరి, "కవివైనచొ చంకనాకు", అన్నాడు. అదిపెద్ద తిట్టు మరి! వెంటనే నాలిక కఱచుకొని, "ఘంటంబేదీ?" అన్నాడు. పోవయ్యా నీవు కవివైతే ఏమి గొప్ప చంకనాకవయ్యా? అని దూషించినట్టు ఒకఅర్ధం. తమరు కవియైతే చంకలో ఆకులు, ఘంటమూ కనబడవేం? అని మరో అర్ధం.

చూశారా? శ్లేష సాయంతో  కవి తన మాటలలో రెండర్ధాలను జోడించాడు. ఇదీ ఈ కందం లోని చమత్కారం! 

*తెలుగు భాషను ఆదరించండి, పోషించండి, రక్షించండి!*

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం